ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర కేంద్ర బడ్జెట్‌లో గర్భాశయ క్యాన్సర్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 9 నుంచి 14 ఏండ్ల వయస్సు ఉన్న బాలికలందరికీ ‘సార్వత్రిక రోగనిరోధక కార్యక్రమం’లో భాగంగా ఉచితంగా.. హెచ్‌పివి (హ్యూమన్ పాపిల్లోమా వైరస్)” అనే టీకా వేసేందుకు ప్రణాళికలు వేస్తున్నామనడం హర్షదాయకం. ప్రపంచ గర్భాశయ క్యాన్సర్ కేసులు/మరణాల్లో 25 శాతం వరకు భారత్‌లోనే నమోదు అవుతున్నాయని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేస్తున్న “సర్వవాక్స్” అనే గర్భాశయ క్యాన్సర్ టీకా ప్రైవేట్ మార్కెట్‌లో ఒక డోసు రూ.2000కు అందుబాటులో ఉన్నది. దీనితో పాటు ‘మెర్క్ షార్ప్’ అనే విదేశీ కంపెనీ తయారుచేస్తున్న ‘గార్డసిల్ -4’ అనే హెచ్‌పివి వ్యాక్సీన్ కూడా భారత మార్కెట్‌లో డోసుకు రూ: 3,927కు, ‘గార్డసిల్ -9’ ధర డోసుకు రూ.10,850 మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
మహిళల పాలిట శాపంగా గర్భాశయ క్యాన్సర్
ప్రపంచవ్యాప్తంగా మహిళలను గజగజలాడిస్తున్న నాలుగు ముఖ్య క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ ఒకటిగా గుర్తించారు. ప్రతి ఏటా 3 లక్షల మంది మహిళలు క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారని, ప్రతి 10 క్యాన్సర్ మరణాల్లో 9 మంది పేద, మధ్య ఆదాయ దేశాలకు చెందిన వారుంటున్నారని గుర్తించారు. భారత మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తర్వాత ప్రమాదకరమైనదిగా గర్భాశయ క్యాన్సర్ పెచ్చరిల్లుతున్నది. 2040 నాటికి భారత్‌లో గర్భాశయ క్యాన్సర్ బాధితులు 54 శాతం వరకు పెరిగే ప్రమాదం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.
ఉచిత టీకాలు, నిర్ధారణ పరీక్షలు తక్షణావసరం
1983లో జర్మన్ సైంటిస్ట్ ‘హరాల్డ్ జుర్ హాసెన్’ చేసిన ప్రయోగాలతో గర్భాశయ క్యాన్సర్‌కు కారణం “పాపిల్లోమా వైరస్” అని కనుగొన్నారు. గర్భాశయ క్యాన్సర్ ప్రమాదకరంగా మారి ప్రజారోగ్య సమస్యగా అవతరించకముందే తగు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వాలు చొరవ చూపాలి. మనదేశంలోని15 ఏండ్లలోపు బాలికలకు హెచ్‌పివి టీకాను ఉచితంగా ఇప్పించడం, 35 నుంచి- 45 ఏండ్ల వయస్సున్న మహిళలకు నిర్ధారణ పరీక్షలు చేయడం, గర్భాశయ క్యాన్సర్ సోకిన మహిళలకు సరైన చికిత్సలు అందుబాటులోకి తేవడం సత్వరమే జరగాలి. 2023లో “యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్”లో హెచ్‌పివి టీకాలను చేర్చడానికి సిఫార్సు చేయబడింది.
క్యాన్సర్ల కట్టడికి టీకాలు
ఆరు రకాల హెచ్‌పివి క్యాన్సర్లలో వల్వర్, గుదము (ఆనల్), యోని (వజీనల్), గొంతు (త్రోట్), గర్భాశయ (సర్వైకల్) ఐదు రకాల క్యాన్సర్లను మహిళల్లో కట్టడి చేయడానికి హెచ్‌పివి టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ హెచ్‌పివి టీకా మహాయజ్ఞం సత్వరమే సఫలం కావడానికి ప్రస్తుతం భారతంలో 20,000 మంది ‘హెచ్‌పివి ఫిజీషియన్స్’ అవసరమని ప్రభుత్వాలు గుర్తించాలి. గర్భాశయ క్యాన్సర్ తరమడంలో హెచ్‌పివి టీకాలను 9 నుంచి-14 ఏండ్ల బాలికలకు అందరికీ విధిగా ఇప్పించాలి. వైద్యులు అందుబాటులో ఉంచడంతోపాటు 30 -నుంచి 40 ఏండ్ల మహిళలకు తప్పనిసరిగా ఉచిత గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేయాలి. ప్రజలకు గర్భాశయ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడం లాంటి చర్యలు ప్రభుత్వాలు, పౌర సమాజం సత్వరమే చేపట్టాలి.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి