
ఇండియన్ స్క్రీన్‌పై వచ్చిన సూపర్ హీరో సినిమాల్లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన ‘క్రిష్’ సిరీస్‌కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే మూడు ఫ్రాంచైజీలుగా వచ్చి సూపర్ సక్సెస్‌ను అందుకుంది. తాజాగా ‘క్రిష్ 4’ రెడీ అవుతోంది. అయితే దీనికోసం హృతిక్ ఫస్ట్ టైమ్ మెగా ఫోన్ పట్టబోతున్నట్టు శుక్రవారం అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని హృతిక్ రోషన్ తండ్రి దర్శకుడు రాకేశ్ రోషన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘25 ఏళ్ల క్రితం నిన్ను నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశాను.
ఇప్పుడు మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఆదిత్యచోప్రా, నేను కలిసి నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. దర్శకుడిగానూ నువ్వు ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. ప్రతిష్టాత్మకమైన ‘క్రిష్ 4’కు నువ్వు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది’ అని రాకేశ్ రోషన్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంతో హృతిక్ దర్శకుడిగా పరిచయమవడంతో బాలీవుడ్ నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.