ముంబై రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు ప్రముఖ హీరో హృతిక్ రోషన్ అండగా నిలిచాడు. ఇలాంటి వాటిని తట్టుకుంటేనే జీవితంలో దృఢంగా ముందుకెళ్లొచ్చని ఆర్యన్‌కు హృతిక్ ధైర్యం చెప్పాడు. ఆర్యన్‌కు సందేశమిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో హృతిక్ ఓ లెటర్ పోస్ట్ చేశారు. దాని సారాంశం:
‘ప్రియమైన ఆర్యన్.. జీవితం ఓ వింతైన ప్రయాణం. అది చాలా అద్భుతమైంది. ఎందుకంటే అది ఊహించని అనుభవాలతో కూడినది. నీ వైపు సవాళ్ల సునామీలను పంపిస్తుంది. కానీ దేవుడు దయా హృదయుడు. ఎదుర్కోగల సత్తా ఉన్న వారికే ఆయన సవాళ్లు విసురుతాడు. గందరగోళ పరిస్థితుల మధ్య ఒత్తిడిని ఎదుర్కుంటున్నావంటే.. నీవు కచ్చితంగా ఎంపిక చేయబడ్డావనే అర్థం. దీన్ని గ్రహించావని అనుకుంటున్నా. కోపం, అయోమయం, నిస్సహాయత స్థితి.. నీలోని నిజమైన హీరోను మరింత సానబెడతాయి. ఇవే నీకు దయ, కరుణ, ప్రేమను కూడా నేర్పుతాయి. తప్పులు, వైఫల్యాలు, విజయాలు.. ఇవన్నీ ఒకటే. కానీ నీ అనుభవాల్లో వేటిని ఉంచుకుంటావు, వేటిని తొలగిస్తావనేది నీకు తెలిసుండాలి. కానీ వీటి వల్ల నువ్వు ఎదుగుతావు. నువ్వు పిల్లాడి నుంచి యువకుడిగా ఎదిగే వరకు నువ్వేంటో నాకు తెలుసు. నీ అనుభవాలే నీకు బహుమతులు. నన్ను నమ్ము.. ప్రశాంతంగా ఉండి, అన్నింటినీ గమనించు. నీ భవిష్యత్ నిర్మాణానికి ఈ క్షణాలే కీలకం. ఈ చీకటి దశను నువ్వు అధిగమించాల్సిందే. ప్రశాంతంగా ఉంటూ వెలుగును నమ్ము. అది నీకు అండగా ఉంటుంది’ అని హృతిక్ రాసిన లెటర్ నెట్‌లో వైరల్ అవుతోంది.