జంతు ప్రేమికులు ఒక్కొక్కరు ఒక్కోరకం. కుక్కలు, పిల్లులు, చేపలు ఇలా ఇష్టమైన వాటిని తీసుకొచ్చి ప్రేమతో పెంచుకుంటారు. ప్రాణంగా చూసుకుంటారు చాలామంది. వాటికి బోర్ కొట్టకూడదని, మానసికంగా యాక్టివ్‌గా ఉంచా లని పార్క్‌లకు వాకింగ్‌కు తీసుకెళ్తుంటారు. ఆడిస్తుంటారు. అందరిలాగానే ఇతను కూడా తన పెంపుడు జంతువును వాకింగ్‌కు తీసుకెళ్లాడు. కానీ కుక్కనో, పిల్లినో కాదు... చేప పిల్లల్ని. ఆశ్చర్యపోతున్నారా! అయితే ఇది చదవండి.
తైవాన్‌కు చెందిన హువాంగ్ జియావోజీకి చేపల్ని పెంచడమంటే చాలా ఇష్టం. అందుకే మూడు గోల్డ్ ఫిష్‌లను పెంచుకుంటున్నాడు. అయితే ఈ మధ్య హువాంగ్ ఒక పని చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. అదేంటంటే... చిన్న పిల్లల్ని నెట్టుకుంటూ తీసుకెళ్లే ట్రాలీ లాంటి దానికి చేపల ఎక్వేరియం ఫిక్స్ చేశాడు. రోడ్డుపైన చేపల్ని తిప్పుతూ కనిపించాడు. మూడు ఇనుప పైపులను నిలువుగా ఒకటి, అడ్డంగా ఒకటి పెట్టి వెల్డింగ్ చేశాడు. తరువాత కింద రెండు పైప్‌లు పెట్టి వాటిమీద బ్యాటరీ, ఆక్సిజన్ మెషిన్, చిన్న బాక్స్‌లో ఫుడ్ ఉంచాడు. సిలిండర్ లాంటి గ్లాస్ జార్‌లో చేపలు వేసి దాన్ని నిలువుగా ఉన్న పైప్‌కు ఫిక్స్ చేశాడు. దానికి ఆక్సిజన్ పైప్, ఒక లైట్ పెట్టాడు. నాలుగు చక్రాల ఈ వీల్ అక్వేరియంను ప్రతి రోజూ పార్క్‌కు తీసుకెళ్తున్నాడు హువాంగ్.
ఇలా ఎందుకు తయారుచేశావని హువాంగ్‌ని అడిగితే... ‘మనుషులైనా, జంతువులైనా ఒక గదిలో కుదురుగా ఉండటం కష్టం. మైండ్ ఫ్రెష్‌గా ఉండాలంటే బయటికెళ్లి కాసేపు సేదతీరాల్సిందే. మరి సముద్రంలో స్వేచ్ఛగా తిరుగుతున్న చేపల్ని తీసుకొచ్చి ప్రేమ పేరుతో జార్స్‌లో బంధిస్తాం. ఒకే గదిలో ఉంచి బయట ప్రపంచాన్ని కనపడకుండా చేస్తాం. అందుకే నా చేపలకు కొంచెం మానసిక ఒత్తిడి తగ్గించాలని ఇది తయారుచేశా’ అని చెప్పాడు.