తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

తెలుగు రాష్ట్రాల్లో  శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి  వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో  మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శివనామ స్మరణతో వేములవాడ రాజన్న క్షేత్రం మారుమోగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తున్నారు. రాజన్నను దర్శించుకునేందుకు క్యూ లైన్ లో బారులు తీరారు భక్తులు. స్వామివారిని దర్శించుకుని కోడె మొక్కలు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు. స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. సాయంత్రం స్వామివారి అద్దాల మండపంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన కార్యక్రమం జరగనుంది. రాత్రి లింగోద్భవ సమయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు.

ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడోరోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి గజవాహనంపై   భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను.. అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనంలో ఆవహింపజేసి ప్రత్యేక హారతులిచ్చారు. శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల మధ్య కన్నులపండువగా గ్రామోత్సవానికి తరలించారు. రాజగోపురం ద్వారా గజ వాహనం స్వామిఅమ్మవార్లను ఊరేగింపుగా బాజా బజంత్రీల మధ్య కన్నులపండువగా శ్రీశైలం పురవీధుల్లో విహరించారు.

చిత్తూరు జిల్లా  శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివచ్చి ముక్కంటి దర్శనం చేసుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి స్వామి వారు శేష వాహనంపై.. అమ్మవారు యాలి వాహనంపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా  తెల్లవారు జాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి  స్వామి వారిని దర్శించుకుంటున్నారు.  ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి.  శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

మహాశివరాత్రి సందర్భంగా నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నది మధ్యలో ఉన్న ఏలేశ్వరంగుట్టకు భక్తులు పోటెత్తారు. ప్రతి సంవత్సరం మహా శివరాత్రికి  ఒక్కరోజు మాత్రమే స్వామి దర్శనం చేసుకుంటారు భక్తులు. భక్తులు గుట్టకు చేరుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే ప్రత్యేకంగా లాంచీలు నడుపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు సుమారు 10 కిలో మీటర్లు నదిలో ప్రయాణించి స్వామి దగ్గరకు చేరుకుంటారు. తర్వాత స్వామివారికి పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు.