న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లు, ఐటీ హార్డ్‌వేర్ సెక్టార్లలో అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్( పీఎల్‌ఐ) స్కీమ్‌కు, ఇండియా ఏఐ మిషన్‌కు, సెమీకండక్టర్ స్కీమ్‌కు ప్రభుత్వం కేటాయింపులను 84 శాతం పెంచింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను రూ.18 వేల కోట్లను అదనంగా ఇచ్చింది. ఇండియాఏఐ మిషన్‌కు రూ.2 వేల కోట్లను కేటాయించగా, కిందటేడాది బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులతో పోలిస్తే 11 రెట్లు పెంచారు.
కిందటేడాది జూన్ బడ్జెట్‌లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మినిస్ట్రీకి మొత్తం రూ.17,566.31 కోట్లు కేటాయించగా, ఈసారి బడ్జెట్‌లో రూ.26,026.25 కోట్లను కేటాయించారు. ఇది 48 శాతం ఎక్కువ. మొబైల్ ఫోన్ల తయారీ సెగ్మెంట్‌లో అమలవుతున్న పీఎల్‌ఐ స్కీమ్‌కు రూ.8,885 కోట్లను ఇచ్చారు. యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లు ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, డిక్సన్ టెక్నాలజీస్, లావా ఇంటర్నేషనల్ ఈ స్కీమ్ కింద లాభపడనున్నాయి.
సెమీ కండక్టర్ మాన్యుఫాక్చరింగ్ సెగ్మెంట్‌కు రూ.2,499 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. కిందటేడాది జూన్ బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,200 కోట్ల నుంచి పెంచారు. అదనంగా కాంపౌండ్ సెమీకండక్టర్లు, సెన్సర్లు, చిప్ అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ యూనిట్లకు జరిపిన కేటాయింపులు రూ.2,500 కోట్ల నుంచి 56 శాతం పెరిగి రూ.3,900 కోట్లకు చేరుకున్నాయి.