వారంలోనే రెండోసారి: ఢిల్లీలో రూ.2 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

వారంలోనే రెండోసారి: ఢిల్లీలో రూ.2 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రమేష్ నగర్‌లో ఇవాళ (అక్టోబర్ 10) 200 కిలోల కొకైన్‌ను స్పెషల్ సెల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన కొకైన్ విలువ దాదాపు రూ.2000 కోట్లు ఉంటుందని వెల్లడించారు. జీపీఎస్ ద్వారా డ్రగ్స్ స్మగ్లర్స్‎ను కదలికలను ట్రాక్ చేసిన పోలీసులు.. పక్కా ప్లాన్ ప్రకారం ఇవాళ పశ్చిమ ఢిల్లీలోని రమేష్ నగర్‌లో సోదాలు చేసి పెద్ద ఎత్తున డంప్ చేసిన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. తమ రాకను ముందే పసిగట్టిన నిందితులు లండన్‎కు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇదే వారంలో ఢిల్లీలో రూ.5,600 కోట్ల విలువైన 500 కేజీల కొకైన్‌ పట్టుబడిన విషయం తెలిసిందే. 

ALSO READ : డ్రగ్స్ కేసులో ఒకప్పటి హీరోయిన్ పేరు... హోటల్ కి వెళ్లడంతో...

దీంతో వారం వ్యవధిలోనే దేశ రాజధానిలో రూ.7,000 కోట్ల విలువైన కొకైన్‌ పట్టుబడింది. ఇవాళ పట్టుబడిన కొకైన్‎కు ఇంతకు ముందు దొరికిన డ్రగ్స్‎కు లింక్ ఉందని అధికారులు వెల్లడించారు. వారం వ్యవధిలోనే రూ.7,500 కోట్ల విలువైన 762 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశామని.. దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్‌ రవాణా ఇదేనని అధికారులు తెలిపారు. ఈ భారీ కొకైన్‌ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ సిండికేట్‌ హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక డ్రగ్ సిండికేట్ -భారత్‎లోని ఢిల్లీ, ముంబైలలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని.. వీరికి- దుబాయ్‌‎తో కూడా లింకులు ఉన్నాయని పేర్కొన్నారు.