- స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలు దాచడం దుర్మార్గం
- నిజాం పాలనలో ప్రజలపై బలవంతంగా ఉర్దూ భాషను రుద్దారు
- విమోచనంపై కాంగ్రెస్, బీఆర్ఎస్వి వక్రభాష్యాలన్న కేంద్రమంత్రి
- కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్లో విమోచన వేడుకలు
హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు: నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను ప్రజలకు తెలియకుండా పాలకులు తొక్కిపెట్టారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వ్యక్తి జన్మదినోత్సవాలు, ఒక సంస్థ వార్షికోత్సవాలు జరుపుకుంటామని, అలాంటిది.. అనేక పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో వచ్చిన స్వాతంత్ర్యం గురించి ఎవరికి తెలియకూడదా? అని ప్రశ్నించారు.
స్వార్థ రాజకీయాల కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం మజ్లిస్ కు సలాం కొడుతూ ఇన్నాళ్లుగా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారని ఆరోపించారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్ తో కలిసి చీఫ్ గెస్టుగా కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి, సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేశారు. పోలీసు కవాతు నుంచి గౌరవవందనం స్వీకరించారు.
మాట మార్చిన కేసీఆర్
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో ‘విమోచన దినోత్సవం’ అధికారికంగా నిర్వహించాలని నిలదీసిన కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాక స్వరం మార్చారని ఆరోపించారు. తన మిత్రపక్షమైన ఎంఐఎం ఆదేశాలతో విమోచనంపై వక్రభాష్యాలు చెప్పారని తెలిపారు. హైదరాబాద్ సంస్థానంలో భాగమై.. ఇప్పుడు కర్నాటక, మహారాష్ట్రలో కలిసిన జిల్లాల్లో ఆయా ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినోత్సవాలు జరుపుతుంటే, ఇక్కడి ప్రభుత్వాలు మాత్రం అధికారికంగా నిర్వహించేందుకు నిరాకరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. విమోచన దినంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వక్రభాష్యాలు చెప్పి ప్రజలను మోసం చేశాయని విమర్శించారు.
ఆగస్టు 15 ఎంత ముఖ్యమో.. సెప్టెంబర్17 కూడా అంతే ముఖ్యం
నాడు నిజాంపాలనకు వ్యతిరేకంగా వ్యవసాయ పనిముట్లనే ఆయుధాలుగా చేసుకుని ప్రజలు నిజాంపై పోరాటం చేశారని, రజాకార్ల ఆగడాలతో అక్కడి ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవించారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. ఆ కాలంలో బలవంతపు మత మార్పిడులకు పాల్పడ్డారని, తెలుగుపై ఆంక్షలు పెట్టి ఉర్దూను ప్రజలపై రుద్దారని అన్నారు. సర్దార్ పటేల్ నిజాంతో ముందుగా శాంతి చర్చలు జరిపారని, ఈ సమయంలో తమ సంస్థానం జోలికి వస్తే హైదరాబాద్ లో ఉన్న కోటిన్నర హిందువులను చంపేస్తామని ఖాసిం రజ్వీ బెదిరించారని ఆరోపించారు.
ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేశారని గుర్తుచేశారు. ఈ తెలంగాణ గడ్డకు స్వాతంత్ర్యం వచ్చిన రోజును కూడా జరపకుండా పాలకులు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం రెండేండ్లుగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుందని, భవిష్యత్‌లోనూ నిర్వహించనున్నదని వెల్లడించారు. చరిత్రను పాలకులు పక్కదారి పట్టిస్తున్నారని, ఆగస్టు 15 ఎంత ముఖ్యమో.. సెప్టెంబర్ 17 కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. చరిత్రను పట్టించుకోని పార్టీలను తరిమి కోట్టాలని పిలుపునిచ్చారు.
ప్రజల బానిస సంకెళ్లు తెంచిన పోరాటం: సంజయ్
కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు తెలంగాణ విమోచన చరిత్రను భూస్థాపితం చేసేందుకు కుట్ర చేశారన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ పోరాటం ఏ వర్గానికో, ఏ పార్టీకో వ్యతిరేకం కానే కాదన్నారు. దేశభక్తులకు, దేశ విభజన ద్రోహులకు మధ్య జరిగిన పోరాటమన్నారు. భూమి కోసం, భుక్తి కోసమే కాదు తెలంగాణ ప్రజల బానిస సంకెళ్లను తెంచిన పోరాటమని చెప్పారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ రాష్ట్రాన్ని ఇప్పటి వరకు పాలించిన ఏ ప్రభుత్వమూ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం బాధాకరమని తెలిపారు. కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్ఎస్ భట్టి, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీశ్ దయాళ్ సింగ్, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు: కిషన్ రెడ్డి
2047 నాటికి వికసిత్ భారత్ సంకల్ప్ లక్ష్యాలతో మోడీ ప్రభుత్వం ముందుకు పోతుందని కిషన్ రెడ్డి చెప్పారు. సభ తర్వాత పరేడ్ గ్రౌండ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అయిందన్నారు. ప్రధాని మోడీ చొరవతో పదేండ్లలో అనేక విజయాలను సాధించినట్టు చెప్పారు. ఈ వంద రోజుల్లో వ్యవసాయం, మౌలిక వసతుల సహా వివిధ రంగాల్లో రూ.15 లక్షల కోట్లు పెట్టామని వెల్లడించారు. రైతులకు గిట్టుబాటు ధర పెంచామని, మత్య్సశాఖకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశామన్నారు. జహీరాబాద్ ను స్మార్ట్ సిటీస్ గా ప్రకటించామని, అక్కడ పదివేల కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడించారు.