తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. రాషష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో తనిఖీలు మొదలుపెట్టింది. డబ్బు, మద్యం తరలింపుపై పోలీసులు నిఘా పెట్టారు. వాహనాలను ఎక్కడికక్కడ ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో రూ. 3 కోట్ల 35 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. అయితే డబ్బులకు సంబంధించిన లెక్కలు చూపించకపోవడంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు. ఇదే అంశంపై మరికాసేపట్లో వెస్ట్ జోన్ డీసీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
ఇక నిన్న శేరిలింగంపల్లి పరిధిలోని గోపనపల్లిలో కాంగ్రెస్ నేత ఫొటోతో ఉన్న రైస్ కుక్కర్లను పంపిణీ చేస్తున్న కొందరిని గచ్చిబౌలి పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి.. 87 కుక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురంలో నాలుగు లక్షల రూపాయలను సీజ్ చేశారు. బషీర్ బాగ్ తనిఖీల్లో భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారంతోపాటు 300 కేజీల వెండి సీజ్ చేశారు అబిడ్స్ పోలీసులు. ఫిల్మ్ నగర్‌లో రూ.30 లక్షల నగదు పట్టుకున్నారు పోలీసులు.
ఎన్నికల కోడ్‌ను అనుసరించి ఈసీ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. పరిమితికి మించి డబ్బుతో వెళ్లడం, మద్యం రవాణా మీద దృష్టిసారించింది. ఈ క్రమంలో హైవేపై వెళ్తున్న కార్లు, బైకులను ముమ్మరంగా తనిఖీ చేస్తున్న పోలీసులు. రూ.50 వేలకు మించి నగదుతో వెళ్తే.. దానికి సంబంధించిన పత్రాలు, రసీదులు, డాక్యుమెంట్లు ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది. డబ్బు మాత్రమే కాదు.. ఆభరణాలకు ఇది వర్తించనుంది.