ఏజెన్సీలో జోరుగా బాల్య వివాహాలు

ఆసిఫాబాద్, వెలుగు: స్కూల్​ మెట్లు ఎక్కాల్సిన బాలికలు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. పుస్తకాల బ్యాగులు మోయాల్సిన వయసులో తలకుమించిన భారం మోస్తున్నారు. ఆడపిల్లను భారంగా భావిస్తున్న తల్లిదండ్రులు చిన్నప్పుడే అత్తారింటికి పంపుతూ బంగారు భవిష్యత్ నాశనం చేస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏటా బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 28 బాల్య వివాహాలు అడ్డుకున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. వెనుక బాటు తనం, ఆర్థిక భారం, తల్లిదండ్రుల నిరక్షరాస్యత, ఆడపిల్లంటే భారంగా భావించడం, ఎలాగైనా పెళ్లి చేసేయాలనే ఆలోచనతోనే చిన్నప్పుడే పెళ్లిచేస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

పెటాకులవుతున్న పెండ్లిళ్లు..

తల్లిదండ్రులు అమ్మాయికి పెళ్లిచేసి అత్తారింటికి పంపించాలని భావిస్తున్నారు. కానీ.. కొద్ది రోజుల తర్వాత చాలామంది పుట్టింటికే చేరుతున్నారు. చిన్నప్పుడే పెళ్లిళ్ల కారణంగా చాలా మంది దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతున్నారు. దాంపత్య జీవితం అంటే ఏమిటో తెలియక పోవడం, కుటుంబ సభ్యులను ఎలా చూడాలో అర్థం కాకపోవడం, సంసారమంటే ఏమిటో తెలియని అమాయకత్వం, ఎలా ముందుకెళ్లాలో అవగాహన లేకపోవడం వంటి కారణాలతో విడాకులు పెరుగుతున్నాయి.

కల్యాణ లక్ష్మికి దూరం...

బాల్య వివాహాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప్రవేశపెట్టింది. కానీ.. ఏజెన్సీ ఏరియాలో ప్రజల్లో అవహగాహన లేకపోవడంతో బాల్యవివాహాల వైపు మొగ్గు చూపుతున్నారు. అమ్మాయి వయస్సు 18, అబ్బాయి వయస్సు 21 సంవత్సాలు ఉంటేనే పెళ్లి చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పుడే పెళ్లి చేయడంతో కల్యాణ లక్ష్మికి దూరమవుతున్నారు. 

ఒక్క మే నెలలోనే 9 బాల్య వివాహాలు..

కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డీసీపీవో, ఎంపీడీవో, తహసీల్దార్, సీడీపీవోల ఆధ్వర్యంలో గత నెల జిల్లా వ్యాప్తంగా 9 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. బెజ్జుర్ మండలం పాపన్ పేటలో ఒకటి, తిర్యాణి మండలం ఉల్లిపిట్టలో ఒకటి, రెబ్బెన మండలం కిష్టాపూర్​లో రెండు, కౌటాల మండలం శీర్షలో ఒకటి, ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ , రాహపల్లిలో రెండు, వాంకిడి మండలం రాంనగర్ లో రెండు బాల్య వివాహాలు అడ్డుకున్నారు.

ఆరోగ్యానికీ ప్రమాదామే..

అమ్మాయిలకు చిన్నప్పుడే పెండ్లి చేస్తే ఆరోగ్యానికి ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. బాలికలు చిన్న వయస్సులో గర్భం  దాలిస్తే తల్లీబిడ్డలకు ప్రమాదమంటున్నారు. పిల్లలు తక్కువ బరువుతో పుడుతారంటున్నారు. పౌష్టికాహార లోపం, రక్తహీనత వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు. 

బాల్య వివాహాలు చేస్తె కఠిన చర్యలు

బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పెళ్లి చేసిన పూజారి, పెళ్లి కొడుకు, సహకరించిన పెద్దలు, ఇరు కుంటుంబాల బంధువులపై కేసులు నమోదు చేస్తాం. బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం రెండు సంవత్సరాలు జైలు, రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తాం. బాల్య వివాహాలు చేయొద్దని అవగాహన కల్పిస్తున్నాం. గ్రామస్థాయిలో బాలల సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడైనా బాల్య వివాహం చేస్తున్నట్లు తెలిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కాల్​చేయండి. 
- మహేశ్, జిల్లా బాలల సంరక్షణ అధికారి

అవేర్నెస్​ కల్పిస్తున్నాం..

బాల్య వివాహాలు చేయొద్దని ప్రజలకు అవేర్నెస్​ కల్పిస్తున్నాం. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు 225 గ్రామ పంచాయతీల్లో సమావేశాలు నిర్వహించాం. మిగతా గ్రామాల్లో కూడా నిర్వహిస్తాం.
‌‌‌‌‌‌‌‌‌‌‌‌- సావిత్రి, పీడీ, ఐసీడీఎస్​