- టెస్ట్‌ల పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో భారీగా వసూళ్లు
- ఎలీసా టెస్ట్‌లు చేయకుండా, ర్యాపిడ్ కిట్లతోనే నిర్ధారణ
- ప్లేట్‌లెట్లు పడిపోతున్నాయని భయపెట్టి ఫీజుల దోపిడీ
- మీకు సగం, మాకు సగం అంటూ ఆర్ఎంపీలకు ఆఫర్లు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో వైరల్ ఫీవర్లు, డెంగ్యూ కేసుల తీవ్రత నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు దోపిడీకి తెగబడ్డారు. జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో వచ్చిన పేషెంట్ల నుంచి రూ.వేలల్లో డబ్బులు గుంజుతున్నారు. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా జ్వరాలు వ్యాపిస్తుండడంతో ఇదే అదనుగా హాస్పిటళ్ల నిర్వాహకులు పైసలు వసూలు చేస్తున్నారు. ముందులు, టెస్టుల పేరుతో డబ్బులు తీసుకుంటున్నారు.
ఆస్పత్రిలోని ల్యాబ్‌లలోనే ర్యాపిడ్టెస్ట్లు చేస్తూ వైరల్ ఫీవర్ అయినా కావొచ్చు, లేదంటే డెంగ్యూ అయినా కావొచ్చు అంటూ పేషెంట్లను భయపెడుతున్నారు. ప్లేట్‌లెట్లు తగ్గుతున్నాయని రిపోర్టు వస్తే చాలు, ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఒకట్రెండు రోజులు హాస్పిటల్‌లో అడ్మిట్ కావాలని చెబుతున్నారు. అడ్మిట్ అయితే ఇక బెడ్, నర్సింగ్, డాక్టర్ విజిటింగ్ చార్జీల పేరుతో రూ.వేలల్లో బిల్లులు వేస్తున్నారు. లేదంటే క్యాజువాలిటీలోనే ట్రీట్‌మెంట్ పేరుతో హడావుడి చేస్తూ, పూటకోసారి పలు రకాల బ్లడ్ టెస్ట్‌లు చేస్తున్నారు.
రెండ్రోజులు ఆస్పత్రిలో ఉంటే చాలు టెస్టులు, మందులు, ఇతర చార్జీల పేరుతో రూ.30వేలకు పైగా బిల్లు ముందు పెడుతున్నారు. ఇంత ఖర్చు భరించలేని పేదలు ప్రభుత్వాస్పత్రులకు, పీహెచ్‌సీలకు వెళ్తే, అక్కడ బెడ్స్ లేక ఒక్కో బెడ్‌పైనే ఇద్దరు ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బెడ్స్ ఖాళీలేవంటూ సిమెంట్ బల్లలు, ఇనుప బల్లలపైనే కూర్చోబెట్టి సెలైన్లను ఎక్కిస్తున్నారు. దీంతో పేషెంట్లు ప్రైవేట్ ఆస్పత్రుల వైపే మొగ్గు చూపుతున్నారు.
ర్యాపిడ్ కిట్ల ద్వారా డెంగ్యూ టెస్ట్‌లు
జ్వర బాధితులకు ఎలిసా టెస్టుల్లో పాజిటివ్‌వస్తే మాత్రమే డెంగ్యూ అని నిర్ధారణ చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని పీహెచ్‌సీలలో సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ను ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలోని టీ హబ్‌కు తీసుకెళ్లి ఎలిసా టెస్టులు చేస్తున్నారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం జ్వరం, ఒళ్లు నొప్పులతో వచ్చిన పేషెంట్లకు నాలుగైదు రకాల రక్త పరీక్షలను చేస్తున్నారు. అందులో రక్తకణాలు పడిపోయినా, ప్లేట్‌లెట్లు తగ్గినా పేషెంట్ల జేబులకు చిల్లు పడినట్టే. రక్తంలో 15 వేలు, 10 వేలకు ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గితేనే పేషెంట్లకు ప్రమాదకరం.
కానీ 60 వేలకు పైగా ప్లేట్‌లెట్లు ఉన్న పేషెంట్లను కూడా రిస్క్ తీసుకోవడం ఎందుకంటూ ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని సూచిస్తున్నారు. ర్యాపిడ్ కిట్ల ద్వారా డెంగ్యూ టెస్ట్ చేసి పాజిటివ్ అని పేషెంట్లను భయపెట్టి భారీగా డబ్బులు గుంజుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక గ్రామాల నుంచి పేషెంట్లను తమ ఆస్పత్రులకు రప్పించుకునేందుకు ఆర్ఎంపీలకు భారీగా ఆఫర్లు ఇస్తున్నారు. పేషెంట్లు కట్టిన ఫీజులో ఫిఫ్టీ, ఫిఫ్టీ అంటూ కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఊరిస్తుండడంతో డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు ఆర్‌ఎంపీలు అలాంటి ఆస్పత్రులకే పేషెంట్లను తీసుకెళ్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా పలు రకాల టెస్టులు చేయించి, భారీగా బిల్లులు వసూలు చేసుకుంటున్నారు.
ఎలీసా టెస్ట్‌లో కన్ఫర్మ్ అయితేనే డెంగ్యూగా ప్రకటించాలి
ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చేసిన డెంగ్యూ పరీక్షలు కేవలం స్క్రీనింగ్‌కు మాత్రమే పనికొస్తాయి. ఎలీసా టెస్టులో కన్ఫర్మ్ అయితేనే డెంగ్యూగా ప్రకటించాలి. ప్లేట్‌లెట్లు 10 వేల వరకు తగ్గినా వాటిని ఎక్కించుకోవాల్సిన పనిలేదు. మందులతో ప్లేట్‌లెట్లు రికవరీ అవుతాయి. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో పనిచేసే స్టాఫ్‌కు కూడా డిసీజ్ ప్రొఫైల్ గురించి ట్రైనింగ్ ఇచ్చాం.
డిసీజెస్ ఐడెంటిఫై అయితే కేంద్ర ప్రభుత్వ హెచ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని చెప్పాం. డెంగ్యూగా తేలితే సదరు పేషెంట్ ఇంటి పక్కన 100 ఇండ్ల వరకు యాంటీ లార్వా స్ర్పే చేయిస్తున్నాం.– వరికూటి సుబ్బారావు, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో
రికార్డుల్లోకి ఎంట్రీ కానీ కేసులు
ఖమ్మం జిల్లా కేంద్రంలో చిన్న, పెద్దవి కలిపి 200కు పైగా క్లినిక్‌లు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఆస్పత్రుల్లోని ల్యాబ్‌లోనే రక్త పరీక్షలు చేస్తారు. మరికొన్నింటిలో మాత్రం పరీక్షల కోసం ముందుగానే ఒప్పందం చేసుకున్న ఇతర డయాగ్నస్టిక్ సెంటర్లకు పేషెంట్లను పంపిస్తారు. ఆస్పత్రి రిఫరెన్స్‌తో వెళ్లిన పేషెంట్ బిల్లులో ఆస్పత్రికి కూడా డయాగ్నస్టిక్ సెంటర్ల నుంచి వాటాలు వెళ్తుంటాయి. ఇలా ఆర్‌ఎంపీలు, ఆస్పత్రులు, ల్యాబ్‌ల వ్యాపారంలో పేషెంట్లు పావులుగా మారుతున్నారు.
ఆరోగ్యం పాడవుతుందన్న భయంతో డాక్టర్లు చెప్పిన టెస్టులన్నీ చేయించుకుంటున్నారు. ఇలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో, ఇతర ల్యాబ్‌లలో నమోదవుతున్న మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ కేసులు ప్రభుత్వ రికార్డుల్లో ఎంట్రీ కావడం లేదన్న విమర్శలున్నాయి. కేవలం కొన్ని ఆస్పత్రుల్లో మాత్రమే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో పేషెంట్ల వివరాలను అప్‌లోడ్ చేస్తుండగా, ఎక్కువ ఆస్పత్రులు మాత్రం లైట్ తీసుకుంటున్నాయి.
ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 385 డెంగ్యూ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 21 మాత్రమే యాక్టివ్ కేసులున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. చికున్‌గున్యా, మలేరియా కేసులు నమోదు కాలేదని, టైఫాయిడ్ కేసులు 78 వచ్చాయని చెబుతున్నారు.
ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన నీలమ్మ (55) వారం రోజులుగా జ్వరం, విరోచనాలు, నీరసంతో బాధపడుతోంది. స్థానికంగా అందుబాటులో ఉన్న ఆర్ఎంపీ దగ్గర చూపించుకున్నా తగ్గకపోవడంతో, నాలుగు రోజుల కింద ఆర్‌ఎంపీని వెంటబెట్టుకొని ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు.
అక్కడ టెస్ట్‌లు చేసి, ప్లేట్‌లెట్స్ 60 వేలకు పడిపోయాయని, వెంటనే ప్రమాదం లేకున్నా ఇంకా తగ్గితే డేంజర్ కాబట్టి ఆస్పత్రిలో అడ్మిట్ అడ్మిట్ అయితే బెటరని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన పేషెంట్ కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. వైరల్ ఫీవర్ అని తేల్చి, రెండు రోజుల్లో మందులు, టెస్ట్‌లు, బెడ్ చార్జీలన్నీ కలిపి రూ.30 వేల వరకు బిల్ అయింది.