- ఛాన్స్ ఇవ్వాలంటున్న వీహెచ్, జెట్టి కుసుమ కుమార్
- రేసులో ముగ్గురు మంత్రుల కుటుంబసభ్యులు
- పొత్తులో తమకు కేటాయించాలంటున్న సీపీఐ
- ఐదు ఆప్షన్లతో ప్రపోజల్స్, ఖమ్మం వైపే మొగ్గు
ఖమ్మం, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశావహులకు ఖమ్మం సీటు హాట్ కేక్‌లా మారింది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబసభ్యులు టికెట్ రేసులో ఉండగా, ఇప్పుడు మరికొన్ని కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. తమకంటే తమకే అవకాశం కల్పించాలంటూ పార్టీ సీనియర్లు బహిరంగంగా కోరుతున్నారు. ఇలా ఖమ్మం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న డజన్ మంది లీడర్లు ఎవరి ప్రయత్నాల్లో వారుంటే, పొత్తుల్లో భాగంగా ఈ సీటును తమకు కేటాయించాలని సీపీఐ పట్టుబడుతుండడం ఆసక్తి రేపుతోంది.
తెరపైకి వీహెచ్, కుసుమకుమార్
సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ రాజకీయాల్లో ఉంటూ, సోనియా కుటుంబానికి వీరవిధేయుడిగా చెప్పుకునే వీహెచ్ కూడా ఖమ్మం సీటు కోసం పట్టుపడ్తున్నారు. తనకంటే అర్హతలెవరికి ఉన్నాయో చెప్పాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ రీసెంట్ గా రేసులోకి వచ్చారు. హైదరాబాద్ సెంట్రిక్ గా పాలిటిక్స్ చేసే ఆయన, ఇటీవల ఖమ్మం డీసీసీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖమ్మం పార్లమెంట్ టికెట్ తనకివ్వాలని హైకమాండ్‌ను కోరారు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్‌తో పాటు వ్యాపారవేత్త వీవీసీ రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. మరో సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరికి కాంగ్రెస్ ఇటీవల రాజ్యసభ సీటు కేటాయించడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. లేదంటే ఆమో కూడా రేసులో ఉండేవారే!
కన్నేసిన సీపీఐ
మరోవైపు కామ్రేడ్లు కూడా ఖమ్మం సీటుపై కన్నేశారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని, ఒక్క అసెంబ్లీ సీటుతో సరిపెట్టుకున్న సీపీఐ, ఇప్పుడు తమకొక పార్లమెంట్ సీటు కేటాయించాలనే ప్రపోజల్ పెట్టింది. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌తో చర్చలు జరిపినప్పటికీ పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నిర్ణయం హైకమాండ్‌దేనని ఇక్కడి లీడర్లు స్పష్టం చేయడంతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీపీఐ జాతీయ నేతలు చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలో తమకు పట్టున్న ఐదు ఆప్షన్లను కామ్రేడ్లు ముందుకు తెస్తున్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించాలని కోరుతున్నారు.
ఇటీవల కొత్తగూడెం అసెంబ్లీ సీటును గెల్చుకోవడంతో పాటు సంస్థాగతంగా బలంగా ఉన్న ఖమ్మం పార్లమెంట్ స్థానం వైపే సీపీఐ మొగ్గుచూపుతోంది. 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకోగా, ఖమ్మం సీటును సీపీఐకి ఇచ్చారు. ఆ పార్టీకి అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కె.నారాయణ ఖమ్మం లోక్ సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. మళ్లీ ఇప్పుడు తమకే కేటాయించాలని సీపీఐ కోరుతోంది. 2014 ఎన్నికల్లో వైసీపీకి సీపీఎం మద్దతివ్వగా, అప్పుడు వైసీపీ తరపున పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌లో ఉండగా, సొంత తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.