ఎంపీ ఎలక్షన్స్: హాట్ సీటుగా ఖమ్మం..

కాంగ్రెస్ లో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. గురువారం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ పార్టీ పెద్దలు ఎవరినీ కలవకుండానే తన పర్యటన ముగించారు. ఓ నేషనల్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రేవంత్.. తిరిగి నేరుగా హైదరాబాద్ వచ్చేశారు. ఆయన ఢిల్లీ పర్యటనలో పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరిగింది. 

రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా, అందులో 14 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఖమ్మం సెగ్మెంట్ కాంగ్రెస్ లో హాట్ సీటుగా మారింది. ఇక్కడి నుంచి పోటీకి పార్టీ కీలక నేతల కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేస్తుండడంతో..  అభ్యర్థి ఎంపిక హైకమాండ్ కు సవాల్ గా మారింది. ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాదరెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కొడుకు యుగేంధర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కొడుకు రఘురామరెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా మాజీ మంత్రి, ఒకప్పుడు టీడీపీలో సీనియర్ నేత అయిన మండవ వెంకటేశ్వర్ రావు పేరు కూడా తెరపైకి వచ్చింది.