కాంగ్రెస్​లో ఎంపీ టికెట్​ కోసం  పోటాపోటీ

కాంగ్రెస్​లో ఎంపీ టికెట్​ కోసం  పోటాపోటీ
  • రేసులో మాజీ ఎంపీలు మల్లు రవి, మంద జగన్నాథం
  • తనకే వస్తుందన్న ధీమాలో సంపత్​ కుమార్​
  • ఆశలు కల్పిస్తున్న అసెంబ్లీ ఎలక్షన్స్​ మెజార్టీ

నాగర్ కర్నూల్, వెలుగు: పార్లమెంట్​ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్​లో ఎంపీ టికెట్​ కోసం రేస్​ మొదలైంది.  నాగర్​కర్నూల్​ ఎస్సీ రిజర్వ్​ స్థానం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మాజీ ఎంపీలు డా.మల్లు రవి, డా.మంద జగన్నాథం ఓపెన్​గా ప్రకటించారు. కాగా నాగర్​కర్నూల్​ పార్లమెంట్​ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో 5 కాంగ్రెస్​,2 చోట్ల బీఆర్ఎస్​  గెలిచాయి. 5 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్​ ఎమ్మెల్యేల మెజార్టీ దాదాపు లక్ష పైనే ఉంది. అసెంబ్లీ ఎలక్షన్​ మూడ్​లో ఉన్న ప్రజలు, అసెంబ్లీ ఎలక్షన్స్​లో వచ్చిన లక్ష మెజార్టీ తమ గెలుపునకు పనిచేస్తాయన్న నమ్మకంతో ఉన్న నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

ప్రత్యేక ప్రతినిధి పోస్ట్​ అడ్డం కాదంటున్న మల్లు..

కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన మల్లు రవి ఈ పదవి తాను పోటీ చేయడానికి అడ్డంకి కాదని తేల్చేశారు. ఎంపీగా గెలిస్తే ప్రత్యేక ప్రతినిధి హోదాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మరింత సమర్థవంతంగా పని చేసే అవకాశం ఉంటుదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన మాజీ ఎంపీ మంద జగన్నాథం తనకు ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చారని, తనకే టికెట్​ వస్తుందన్న ధీమాతో ఉన్నారు.

ఇద్దరు మాజీలు పార్టీ టికెట్​కోసం ప్రయత్నిస్తుంటే మరోవైపు అలంపూర్​ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్​కుమార్​ పార్టీ టికెట్​ ఇచ్చే ముందు తన అభిప్రాయం తీసుకుంటారని, వేచిచూసే ధోరణితో ఉన్నారు. గత లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ నుంచి పోటీ చేసిన పోతుగంటి రాములు దాదాపు లక్ష మెజార్టీతో గెలిచారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులు అదే మెజార్టీతో విజయం సాధించారు.

నాగర్​కర్నూల్​ లోక్​సభ స్థానం నుంచి మల్లు రవి రెండు సార్లు, మంద జగన్నాథం నాలుగు సార్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 1991లో మొదటిసారి ఎంపీగా గెలిచిన మల్లు రవి, 1998లో రెండో సారి లోక్​ సభకు వెళ్ళారు. రాజకీయ ప్రవేశం నుంచి కాంగ్రెస్​ పార్టీనే నమ్ముకున్న ఆయన ఇప్పటి వరకు అందులోనే కొనసాగుతున్నారు. వైఎస్​ హయాంలో కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశారు.

1996లో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన మంద జగన్నాథం నాలుగు సార్లు ఆ పార్టీ నుంచి లోక్​సభకు ప్రాతినిథ్యం వహించారు.​ బీఆర్ఎస్​లో చేరిన ఆయన 2014లో బీఆర్ఎస్​ నుంచి పోటీ చేయగా, కాంగ్రెస్​ నుంచి పోటీ చేసిన నంది ఎల్లయ్య గెలిచారు. 2018లో బీఆర్ఎస్​ నుంచి పోటీ చేసిన పోతుగంటి రాములు ఎంపీగా గెలిచారు. నాగర్​ కర్నూల్​ లోక్​సభ నియోజకవర్గానికి మంత్రి జూపల్లి కృష్ణారావుకు పార్టీ ఇన్​చార్జిగా బాధ్యతలు అప్పగించారు. అయితే పార్టీ హైకమాండ్​ ఎవరికి సీటు కేటాయిస్తుందోనని పార్టీ శ్రేణులు వేచి చూస్తున్నారు.

ప్రచారంపై ఫోకస్..
 
వనపర్తి, వెలుగు: లోక్ సభ ఎన్నికలకు ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ వెలువడుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు లోక్ సభ సీట్లను కైవసం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గకముందే మళ్లీ గ్రామాల్లో లోక్​సభ  ఎన్నికల కోలాహలం మొదలైంది.

అభ్యర్థుల ఎంపిక పూర్తి కాకపోయినా టికెట్  ఆశిస్తున్న నేతలు అసెంబ్లీ సెగ్మెంట్లలో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ క్యాడర్ ను అప్రమత్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్  పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానాలపై దృష్టి పెట్టాయి. తన సొంత జిల్లా అయిన ఉమ్మడి  మహబూబ్ నగర్  లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉంటే ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీలో ఉంటారనే టాక్​ నడుస్తోంది.

ఆయన అందరికంటే ముందుగా పార్టీ క్యాడర్ ను సమన్వయం చేసేందుకు ప్రత్యేక వ్యూహంతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ సీటులో బీజేపీ తరవున పలువురు టికెట్ ఆశిస్తున్నప్పటికీ మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు. బీఆర్ఎస్  నుంచి సిట్టింగ్  ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తారా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? అనే విషయంపై సస్పెన్స్​ కొనసాగుతోంది. నాగర్ కర్నూల్  నుంచి కాంగ్రెస్  పార్టీ తరపున మాజీ ఎంపీలు మల్లు రవి, మందా జగన్నాథం, అలంపూర్  మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, రిటైర్డ్  పోలీస్​ ఆఫీసర్​ యాదయ్య టికెట్​ ఆశిస్తున్నారు.

బీఆర్ఎస్  పార్టీ నుంచి సిట్టింగ్  ఎంపీ పి.రాములు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ నేత బంగారు శృతి ఈసారి కూడా టికెట్​ వస్తుందని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాల్లో 12 అసెంబ్లీ స్థానాలు గెలవడంతో, ఈ రెండు పార్లమెంట్​ స్థానాలు తమకే దక్కుతాయని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ప్రచారంలో కూడా కాంగ్రెస్​ పార్టీ నేతలే ముందున్నారు.