యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట నారసింహ క్షేత్రంలో సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం హాలీడే, సోమవారం బక్రీద్ సెలవు ఉండడంతో..రెండు రోజుల నుంచి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. దీంతో ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట పట్టింది. రద్దీ అధికంగా ఉండడం, అందుకనుగుణంగా సదుపాయాలు లేకపోవడంతో కొందరు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లలో సరిపడా ఫ్యాన్లు లేకపోవడంతో.. ఉక్కపోత ఎక్కువై ఈ పరిస్థితి తలెత్తింది.
ప్రసాద కౌంటర్ వద్ద ఓ మహిళ, వీఐపీ దర్శన క్యూలైన్లలో ఓ చిన్నారి సొమ్మసిల్లి పడిపోయారు. ఆలయానికి సంబంధించిన డాక్టర్ వచ్చి ప్రథమ చికిత్స చేశారు. మరోవైపు సోమవారం కొండపైన శివాలయంలో స్పటిక లింగానికి అభిషేకం, బిల్వార్చన నిర్వహించారు. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా సోమ వారం రూ.66,21,151 ఆదాయం వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.23,28,910, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.12.60 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.9 లక్షలు, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.4,67,400, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.5,64,600 ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.