గ్రీవెన్స్​ కు భారీగా జనం

గ్రీవెన్స్​ కు భారీగా జనం
  • మూడు వారాల తర్వాత కలెక్టరేట్ లో ప్రజావాణి 
  • పెద్దసంఖ్యలో వచ్చిన దరఖాస్తుదారులు

  ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం జరిగిన గ్రీవెన్స్​ కు  జనం భారీగా తరలివచ్చారు.  ఇటీవల వర్షాలు, వరదల కారణంగా గత మూడు వారాలు గ్రీవెన్స్​ జరగలేదు. వరద ప్రభావం తగ్గిన తర్వాత కూడా సహాయక చర్యల్లో అధికారులు బిజీగా ఉండడంతో గ్రీవెన్స్​ ను రద్దు చేశారు. దీంతో మూడువారాల అనంతరం  ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు వచ్చారు. 

 వెల్లువలా వరద బాధితుల దరఖాస్తులు 

జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. రెవెన్యూ, ధరణికి చెందిన దరఖాస్తులతో పాటు పలువురు ఇటీవల వరదల కారణంగా నష్టపోయిన బాధితులు కూడా తమకు పరిహారం అందలేదని దరఖాస్తులు సమర్పించారు. వరద సహాయం కోసం అధికారులు సర్వే చేస్తున్న సమయంలో తాము ఇతర ప్రాంతాల్లో ఉండడం వల్ల నష్టం జరిగిందని వాపోయారు. దీంతో దరఖాస్తులపై మళ్లీ ఎంక్వైరీ చేయించి, అర్హులకు న్యాయం చేస్తామని అధికారులు వారికి హామీనిచ్చారు.


 చింతకాని మండలం ప్రొద్దుటూరు ఎస్సీ కాలనీకి చెందిన తూడెం మరియమ్మ అనే రైతు తమ కుటుంబానికి ఉన్న రూ.1,42,669 పంట రుణాలను రుణమాఫీ పథకం క్రింద మాఫీ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, వ్యవసాయ శాఖ అధికారికి రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో ఓల్డ్ ఎన్టీఆర్ కెనాల్ కొరకు సేకరించిన 34.5 కుంటల భూమిని జేవీఆర్ ఓసి ప్రాజెక్టు 2 వారు తీసుకున్నందున, భూమికి జారీ చేసిన అవార్డు ప్రకారం నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ నిర్వాసితులు  దరఖాస్తు చేసుకోగా తనిఖీ చేసి,  ప్రతిపాదనలు సమర్పించాలని  భూ సేకరణ అధికారికి  ఆదేశించారు.  అనంతరం    కలెక్టర్​   ప్రజా సమస్యలను పెండింగ్ లో ఉంచకుండా, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారిణి అరుణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మత్స్యకారులను ఆదుకోవాలి

ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా లక్షలాది రూపాయల విలువైన చేప పిల్లలను వదలగా, వరదలు, చెరువులకు గండ్లు పడడంతో అంతా కొట్టుకుపోయి నష్టపోయామని జిల్లా మత్సకారుల సహకార సంఘం సభ్యులు కలెక్టర్​ ను కలిసి వినతిపత్రం అందించారు. వరదలతో కోట్లాది రూపాయల విలువైన మత్స్య సంపదను కోల్పోయామని, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. జరిగిన నష్ట వివరాలను ప్రభుత్వానికి పంపి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్​ వారికి తెలిపారు.