యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సమ్మర్ హాలీడేస్ కు తోడు సండే కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎక్కువ సంఖ్యలో వచ్చిన భక్తులతో నారసింహుడి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో వెయిట్ చేయాల్సి వచ్చింది. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులు నిర్వహించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.53,32,909 ఆదాయం సమకూరింది.
అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.20,00,220, కొండపైకి వాహనాల ఎంట్రీతో రూ.7 లక్షలు, వీఐపీ టికెట్ల ద్వారా రూ.6.45 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.4,38,300, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.6,29,550, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ.1,73,600, యాదరుషి నిలయం ద్వారా రూ.2,35,024, సువర్ణపుష్పార్చనతో రూ.1,26,632, కల్యాణకట్ట ద్వారా రూ.1.80 లక్షల ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.