జనసంద్రమైన జంపన్నవాగు.. భారీగా తరలివచ్చిన జనం

మేడారం జాతరకు వచ్చిన భక్తులతో ఇవాళ జంపన్నవాగు జన సంద్రమైంది. మేడారం వన దేవతల దర్శనానికి వచ్చిన భక్తులు మొదట జంపన్నవాగు వద్దకు చేరుకుని అక్కడ పుణ్య స్నానాలు ఆచరించారు.  భక్తులతో జంపన్నవాగు ఇరువైపులా కిక్కిరిసిపోయింది.  పుష్కలంగా నీరు ఉండడంతో కొంతమంది భక్తులు జంపన్నవాగులో, మరి కొంతమంది భక్తులు జంపన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ వద్ద  స్నానాలు చేశారు. 

ఇసుక వేస్తే రాలనంత భక్త జనంతో జంపన్నవాగు ప్రాంతం సందడిగా మారింది. పుణ్యస్నానాలు ఆచరించిన వారు గద్దెల వద్దకు చేరుకునేందుకు కూడా బాగా సమయం పడుతోంది. క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి. గంటల తరబడి క్యూలైన్లో నిలుచోవాల్సి వస్తోందని భక్తులు తెలిపారు.  మేడారం శ్రీ సమ్మక్క - సారలమ్మ మహా జాతర దృష్ట్యా ములుగు, భద్రాది కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఇసుక విక్రయాలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ తెలిపింది.