పేరుకు తగ్గట్టే భాగ్యనగరం సంపన్నుల కేంద్రంగా మారుతోంది. ఖరీదైన కార్లకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తోంది. భారత్ లో రోజుకు 70కి పైగా ప్రీమియం లగ్జరీ కార్లు అమ్ముడవుతుంటే.. అందులో దాదాపు 20 కార్లను హైదరాబాదీలే కొంటున్నారు. వీటితోపాటు ప్రీమియం టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మొబైల్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. లగ్జరీతో పాటు స్టేటస్ సింబల్ గా భావిస్తూ.. ఐఫోన్లు కొనే వారి సంఖ్య పెరుగుతోంది.
ప్రీమియం లగ్జరీ కార్లకి డిమాండ్
సమాజంలో ప్రత్యేకంగా కనిపించేందుకు కొందరు అతి ఖరీదైన కార్లను కొంటుంటే.. స్పోర్టీ లుక్ తో హైస్పీడ్ వెహికల్స్ పై హైక్లాస్ యూత్ మనస్సు పారేసుకుంటున్నారు. దీంతో 50 లక్షల నుంచి రెండు కోట్ల రూపాయలుండే ప్రీమియం లగ్జరీ కార్లకి డిమాండ్ బాగా పెరుగుతోంది. మెర్సిడిస్ బెంజ్, BMW, ఆడి, వోల్వో, ఫోక్స్ వ్యాగన్, టయోటా, జాగ్వార్-ల్యాండ్ రోవర్, పోర్షే, రోల్స్ రాయిస్ లాంటి ఖరీదైన కార్ల షోరూములన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి. ఐదు కోట్ల విలువైన బెంట్లీ స్పోర్ట్స్ కార్ కూడా రోడ్డుపైకి రాగా.. ఇరవై కోట్ల ఆస్టాన్ మార్టిన్ జేమ్స్ బాండ్ కార్లని కూడా హైదరాబాద్ కి తీసుకొస్తున్నారు.
సచిన్ మెచ్చిన ఫెర్రారీ కారు, మహేంద్ర సింగ్ ధోనీ వాడుతున్న హమ్మర్ కూ హైదరాబాద్ లో బుకింగ్స్ ఉన్నట్టు ఆటో మొబైల్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సహజంగానే లగ్జరీ కార్లను పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, సినిమా స్టార్లు ఎక్కువగా వాడుతుంటారు. కానీ ఇప్పుడా జాబితా చాలా పెద్దదైంది. బడా కంపెనీల్లో పనిచేసే ఉన్నతాధికారులు కూడా బెంజ్, BMW, ఆడి లాంటి కంపెనీల కార్లల్లో తిరుగుతున్నారు. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ లాంటి రంగాల్లోనూ సంపన్నుల జాబితా పెరిగింది.
లగ్జరీ కార్ల అమ్మకాలు 55శాతం పెరిగాయి
కోవిడ్ టైమ్ లో కొంత తగ్గినా.. ఇప్పుడు లగ్జరీ కార్ల అమ్మకాలు ప్రీ కోవిడ్ లెవల్ ని దాటేశాయి. మధ్యతరగతి జనం ఆదాయం తగ్గడం, నిత్యావసరాల ధరలు పెరగడంతో...కొన్ని ఎలక్ట్రానిక్స్, కార్ల కొనుగోళ్లు తగ్గాయి. కానీ లగ్జరీ కార్లు, ప్రీమియం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఆటోమొబైల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం.. ఈ ఏడాది మొదట్లో లగ్జరీ కార్ల అమ్మకాలు 55శాతం పెరిగాయి. లంబోర్గినీ, BMW, మోటోరాడ్, మెర్సిడెజ్ బెంజ్ లాంటి విలాస వాహనాల తయారీదారులకు అమ్మకాల పరంగా భారత్ అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న మార్కెట్ గా మారింది. 2021-22లో 11వేల 576 మెర్సిడ్ బెంజ్ కార్లు, 8వేల 496 BMW కార్లు, 3వేల 294 ఆడీ కార్లు, 14 వందల 66 వోల్వో కార్లు, వెయ్యి 21 రేంజ్ రోవర్, 666 ల్యాండ్ రోవర్, 634 మినీ, 195 జాగ్వర్ కార్లు కలిపి మొత్తం 27వేల 348 వాహనాలు అమ్ముడయ్యాయి.
ఎలక్ట్రానిక్ వస్తువుల్లో జనవరి నుంచి మే వరకూ 55 అంగుళాల కంటే పెద్ద టీవీల అమ్మకాలు 66 శాతం పెరిగాయని కన్జ్యూమర్ ఇంటెలిజెన్స్ GFK ఇండియా ప్రకటించింది. 350 లీటర్ల కంటే అధిక సామర్థ్యం ఉన్న రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు 44 శాతం.. 8 కేజీలకు మించిన సామర్థ్యం ఉన్న వాషింగ్ మెషిన్ల అమ్మకాలు 29 శాతం పెరగాయి. హైఎండ్ గేమింగ్ ల్యాప్ టాప్ సేల్స్ 107 శాతం పెరిగాయి. తమ ఉత్పత్తుల అమ్మకాలు 70 శాతం పెరిగినట్టు జర్మనీకి చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ బాష్ ప్రకటించింది.
ప్రీమియం ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది
గతేడాదితో పోలిస్తే.. భారత్ లో ఐఫోన్ల సేల్స్ 23శాతం పెరిగాయి. అందులో 70వేల రూపాయల విలువన్న ఐఫోన్ మోడల్స్ ఎక్కువగా అమ్ముడుపోయాయి. 30వేల కంటే ఎక్కువ రేటున్న స్మార్ట్ ఫోన్ ల మార్కెట్ కూడా ఒకటిన్నర రెట్లు పెరిగాయి. ఐఫోన్స్ తో పాటు సామ్ సంగ్, వన్ ప్లస్ ఫోన్ లు ఎక్కువగా కొంటున్నారు. మెట్రో సిటీస్ తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి టూ టైర్ నగరాల్లోనూ ప్రీమియం ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది.