మేడారంలో భక్తుల రద్దీ

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. త్వరలో మహాజాతర ప్రారంభం కానుండడం, ఆదివారం సెలవు కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం)తో పాటు కోళ్లు, మేకలను సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అడవిలోనే వంటలు చేసుకున్నారు. అలాగే వన దేవతలను నిర్మాత బండ్ల గణేశ్‌‌ దర్శించుకున్నారు. ఆయనకు పూజారులు, ఎండోమెంట్‌‌ ఆఫీసర్లు డోలు వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు.

అనంతరం ఆయన నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గణేశ్‌‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ అధికారంలోకి రావాలని కోరుకున్నానని, ఆ కోరిక నెరవేరినందునే అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు మేడారం వచ్చానన్నారు.         - 
ములుగు, తాడ్వాయి, వెలుగు