తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు తాత్కాలిక క్యూలో భక్తులు వేచి ఉన్నారు. రద్దీ దృష్ట్యా భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెరటాసి మాసం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీనివాసుడి దర్శనానికి వస్తున్నారు. ఎక్కువగా తమిళనాడు నుంచి భక్తులు భారీగా వస్తున్నారు.
వైకుంఠం కాంప్లెక్స్, కల్యాణ కట్ట, లడ్డు వితరణ కేంద్రాలతో పాటు యాత్ర ప్రదేశాలన్ని భక్తులతో కిక్కిరిసి పోయాయి. అలిపిరి దగ్గర భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాలినడకన వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. టీటీడీ సిబ్బంది క్యూలలో భక్తులకు అల్పాహారం, తాగునీరు అందిస్తున్నారు.