
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం ధర్మగుండంలో స్నానం చేసి స్వామివారి దర్శనం కోసం క్యూలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ కారణంగా కోడెల టికెట్ కౌంటర్లు, దర్శన, ప్రసాద క్యూలైన్లు నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి సుమారు నాలుగు గంటలు పట్టిందని భక్తులు తెలిపారు. దర్శనం అనంతరం కోడెలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
మరో వైపు వేములవాడ అనుబంధమైన భీమేశ్వర ఆలయంలోనూ రద్దీ కొనసాగింది. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. మరోవైపు సోమవారం నుంచి జగద్గురు శంకరాచార్యుల జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకరచార్యులకు పంచోపనిషత్ద్వారా అభిషేకం నిర్వహించారు. ఐదు రోజుల పాటు ఉత్సవాలను కొనసాగించనున్నారు.