
వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టోకన్ల కోసం రాత్రి నుండే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తిరుమలలోని క్యూలైన్లలో ఎక్కువ సేపు వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వీలుగా తిరుపతిలో దర్శన టోకన్లు జారీ చేస్తోంది టీటీడీ . తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం 4 లక్షల 23 వేల 500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు.
తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం,గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, భైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్‌పి హైస్కూల్‌లో ఉచితంగా సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుఙడా టీటీడీ ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టింది.
టోకెన్లను పొందిన భక్తులు 24గంటల సమయం ముందే తిరుమలకు రావాలని అధికారులు తెలిపారు. దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే గదులు కేటాయిస్తామన్నారు. టోకెన్స్ లేని భక్తులు తిరుమలకు రావొచ్చు..కానీ ఆ భక్తులకు శ్రీవారి దర్శనంతో పాటు గదులను కేటాయించమని అధికారులు స్పష్టం చేశారు.
డిసెంబర్23వ తేదీ వేకువజామున 1.45నిమిషాల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని ప్రారంభిస్తారు. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తారు. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేస్తారు. వీఐపీలు వారి కుటుంబ సభ్యులతో వస్తేనే దర్శనం టికెట్లను కేటాయిస్తారు. ఈ పది రోజుల పాటు సిఫారస్సు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. తిరుమల్లో వసతి సమస్య ఉందని, వీఐపీలు టీటీడీకి సహకరించి తిరుపతిలో వసతిని పొందాలని అధికారులు సూచించారు.
వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రథంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులు, అర్చకులతో చర్చించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.