పర్వతగిరి శివాలయానికి పోటెత్తిన భక్తులు

  •  శివాలయానికి పోటెత్తిన భక్తులు
  • ప్రత్యేక పూజలు చేసిన మంత్రి హరీశ్​రావు
  • ముగిసిన విగ్రహ ప్రతిష్టాపన
  • 4 జిల్లాల నుంచి భక్తుల రాక

పర్వతగిరి, వెలుగు: పర్వతగిరి శివాలయం భక్తజనసంద్రమైంది. పునరుద్ధరించిన ఆలయంలో శివున్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గత మూడ్రోజులుగా సాగుతున్న ప్రతిష్ఠాపన కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. ముగింపు రోజు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గుడి నిర్మాణ కర్త, ఆర్డీఎఫ్​ ఫౌండర్​ ఎర్రబెల్లి రాంమ్మోహన్​రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ఎమ్మెల్యేలు.. మంత్రికి ఘన స్వాగతం పలికారు. జనగామ, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

గుడి అద్భుతం..

పర్వతాల శివాలయం గుడి అద్భుతంగా ఉందని.. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, పక్కనే రిజర్వాయర్​చూడముచ్చటగా ఉందని మంత్రి హరీశ్​రావు అన్నారు. 800 ఏండ్ల కింద కట్టిన ఆలయాన్ని రాంమ్మోహన్ రావు పునరుద్ధరించడం గొప్ప విషయమన్నారు. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. టూరిస్ట్ స్పాట్​గా మార్చేందుకు కేసీఆర్ తో చర్చిస్తామన్నారు.

ప్రముఖుల పూజలు..

శివాలయంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎంపీలు పసునూరి దయాకర్, వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయభాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య, శంకర్​నాయక్​, నన్నపనేని నరేందర్, ఒడితెల సతీశ్​కుమార్ తదితరులు పూజలు చేశారు. ప్రముఖ సింగర్ సునీత, ఫోక్ సింగర్​ కనుకవ్వ పాటలు పాడి అలరించారు.