పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తజనం

పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తజనం

సూర్యాపేట వెలుగు : ఓ లింగా.. ఓ లింగా నామస్మరణ.. భేరీల మోతలు... గజ్జల సప్పుళ్లు, సంప్రదాయ నృత్యాలతో  పెద్దగట్టు పరిసరాలు మార్మోగాయి.  సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని లింగమంతుల స్వామి జాతరకు రెండో రోజు సోమవారం భక్తులు పోటెత్తారు.  ఆలయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి దేవరపెట్టే పెద్దగట్టుకు చేరుకున్న అనంతరం యాదవుల కులదైవం లింగమంతుల స్వామికి బోనం చెల్లించేందుకు వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుండే  తరలివచ్చారు. 

 లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లిని దర్శించుకునేందుకు  బారులు తీరారు. రెండో రోజు మద్దిపోలుతో మున్నా, మెంతబోయిన వంశస్తులు దేవరపెట్టే ముందు నైవేద్యం సమర్పించారు. భక్తులతో సందడి నెలకొనగా గొల్లగట్టు కోలాహలంగా కనిపించింది.  లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.