యాదగిరిగుట్టలో కార్తీకమాసం ముగింపుతో భారీగా తరలివచ్చిన భక్తులు

యాదగిరిగుట్టలో కార్తీకమాసం ముగింపుతో భారీగా తరలివచ్చిన భక్తులు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులు కిటకిటలాడింది. కార్తీకమాసం ముగింపు కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, కొండపైన బస్‌‌‌‌‌‌‌‌బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, కొండ కింద లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, వ్రత మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల ఎక్కువ సంఖ్యలో వాహనాల్లో రావడంతో పార్కింగ్ ఏరియా పూర్తిగా నిండిపోయింది. 

దీంతో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ జామ్‌‌‌‌‌‌‌‌ కాకుండా వాహనాలను హెలీప్యాడ్‌‌‌‌‌‌‌‌ ప్రదేశానికి తరలించారు. కార్తీక పూజల్లో భాగంగా భక్తులు సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తీక దీపారాధన, శివకేశవులకు రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన నిర్వహించారు. రద్దీ కారణంగా నారసింహుడి ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. మరోవైపు నారసింహుడి నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

ఆదివారం భక్తులు జరిపించిన పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.56,71,426 ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.21,31,980, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.7 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.8,37,900, బ్రేక్ దర్శనాలతో రూ.4,84,200, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.3,44,550 ఆదాయం వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు.

రికార్డు స్థాయిలో సత్యనారాయణస్వామి వ్రతాలు

సత్యనారాయణస్వామి వ్రతాలు అన్నవరం తర్వాత యాదగిరిగుట్టలోనే ఎక్కువగా జరుగుతాయి. నవంబర్‌‌‌‌‌‌‌‌ 2న మొదలైన కార్తీకమాసం డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 1తో ముగిసింది. ఈ మాసంలో యాదగిరిగుట్టలో రికార్డు స్థాయిలో సత్యనారాయణస్వామి వ్రతాలు జరిగాయి. గతేడాది కార్తీకమాసంలో 20,524 వ్రతాలు జరుగగా.. ఈ సంవత్సరం ఏకంగా 23,248 వ్రతాలు జరిగాయి. గతంలో పోలిస్తే ప్రస్తుతం 2,724 వ్రతాలు ఎక్కువగా జరగడం విశేషం. ఈ సంవత్సరం సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణ కారణంగానే ఆలయానికి రూ.1,85,98,400 ఆదాయం వచ్చింది.