- SSA కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల్లో భారీ తేడా
- పని పెరిగినా ఏండ్లుగా జీతాలు పెంచని సర్కార్
- పీఏబీలో పెంచినట్టు చూపిస్తున్నా.. ఆ మేరకు ఇవ్వడం లేదు
- ఏపీలో లెక్కనే ఇక్కడా వేతనాలు పెంచాలంటున్న ఎంప్లాయీస్
హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) కాంట్రాక్టు ఎంప్లాయీస్‌కు వేతన కష్టాలు కొనసాగుతున్నాయి. కొందరికి ఐదేండ్ల నుంచి, మరికొందరికి నాలుగేండ్లుగా శాలరీలు పెరగలేదు. రాష్ట్రంలో జిల్లాలు, మండలాల విభజనతో ఎంప్లాయీస్‌కు పనిభారం పెరిగితే, పక్కనున్న ఏపీలో మాత్రం వేతనాలు పెరుగుతున్నాయి. కేంద్ర సర్కార్ నుంచి వేతనాల కోసం ఫండ్స్ వస్తున్నా, వాటిని ఎంప్లాయీస్‌కు ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో స్కూల్ క్లస్టర్ స్థాయి నుంచి స్టేట్ఆఫీస్ వరకు ఎస్ఎస్ఏ ప్రాజెక్టులో సుమారు 18 వేల మంది పనిచేస్తున్నారు. ఎస్ఎస్ఏ ఫండ్స్ లో కేంద్రం వాటా 60 శాతం ఉంటే, స్టేట్ షేర్ 40శాతం. అయితే ఎంప్లాయీస్ జీతాలనూ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) పెంచినట్టు చూపిస్తున్నా, వారికి మాత్రం వేతనాలు ఇవ్వడం లేదు. సిబ్బందికి హయ్యస్ట్ జీతం రూ.15వేలే కావడం గమనార్హం. కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలనే రూల్ ఉన్నా, తెలంగాణలో మాత్రం అమలు కావడం లేదు. జీతాలు పెంచాలని ఎంప్లాయీస్ ఆందోళనలు చేస్తున్నా, సర్కారు పట్టించుకుంటలేదు.
విభజన జరిగినా.. జీతాలు పెరగలే
రాష్ట్రంలో మండలాల విభజన జరిగినా, ఎస్ఎస్ఏలో మాత్రం ఎంప్లాయీస్ పెరగలేదు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న వారే కొత్త మండలాల పనులు కూడా చేస్తున్నారు. స్పెషల్ చిల్డ్రన్స్‌కు పాఠాలు చెప్పే ఐఈఆర్పీలకు ఐదేండ్ల కింద రూ.15వేల వరకు జీతాలు పెంచారు. ఎంఈవో ఆఫీసుల్లో పనిచేసే ఎంఐఎస్ కోఆర్డినేటర్లకు నాలుగేండ్ల కింద రూ.15వేలకు పెంచారు. అయితే వీళ్లే కొత్త మండలాల పనితో పాటు అకౌంట్స్ కూడా చూస్తున్నారు. అయినా అదనంగా పైసా ఎక్కువ ఇవ్వడం లేదు. మిగిలిన కంప్యూటర్ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డీఎల్ఎంటీలు, మెస్సెంజర్లు, సీఆర్పీలకూ జీతాలూ పెరగడం లేదు. సీఆర్పీలు మాత్రం స్టేట్‌లో అవసరానికి మించి ఎక్కువగా ఉన్నారనే సాకుతో, వారికి పీఏబీ నుంచి అప్రూవ్ అయినా జీతం ఇవ్వడం లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
మిగిలిన విభాగాల వారి గురించి అడిగితే మాత్రం, సమాధానం చెప్పడం లేదు. మన పక్కనున్న ఏపీలో మాత్రం దాదాపు అన్ని విభాగాల వారికీ నెలకు రూ.23,500 వేతనం ఉంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏపీ కంటే తక్కువగా వేతనాలు ఇవ్వడంపై తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఏపీలో ఇచ్చినట్టుగానే వేతనాలు పెంచి ఇవ్వాలని వారంతా కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
మార్కుల లెక్క తేలకుండానే మెరిట్ జాబితా విడుదల
నేటి నుంచి జేఈఈ మెయిన్..తొలిసారిగా ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం
తెలంగాణ, ఏపీ ఇంటర్ బోర్డుల అధికారులపై హైకోర్టు ఆగ్రహం
ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా కడ్తోంది..కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు ఫిర్యాదు