పంచాయతీలు, మున్సిపాలిటీల ఆదాయానికి గండి

  • టీఎస్​బీపాస్​తో ఇంటి పర్మిషన్​ ఫీజులు ప్రభుత్వ ఖాతాలోకి
  • స్టాంప్ డ్యూటీ, మైనింగ్​ సీనరేజీ, మ్యుటేషన్ల రుసుమూ అటే
  • లోకల్​గా అభివృద్ధి పనులకు నిధుల కటకట
  • సర్పంచ్​లు, చైర్​ పర్సన్​లకు అవస్థలు​ 

జనగామ, వెలుగు: పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన నిధులకు ఎగనామం పెడుతున్న రాష్ట్ర సర్కార్ ఇప్పుడు వాటికి వచ్చే సొంత ఆదాయానికి కూడా గండికొడుతోంది. వాటి ఆమ్దానీపై తమదే పెత్తనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికే లోకల్ బాడీలకు మైనింగ్ సీనరేజీ, స్టాంప్​ డ్యూటీలో వాటా ఇవ్వట్లేదు.. కొత్తగా ఇండ్ల పర్మిషన్​ ఫీజులను కూడా గుంజుకుంటోంది. 

అనుమతుల సులభతరం పేరుతో తెచ్చిన టీఎస్ బీపాస్ కారణంగా చెల్లింపులన్నీ నేరుగా సర్కారు ఖజానాకు చేరుతున్నాయి. దీంతో స్థానికంగా నిర్ణయం తీసుకుని డెవలప్ మెంట్ పనులను చేపట్టేందుకు లోకల్​బాడీల చేతిలో పైసా కూడా ఉండడం లేదు. ఏ చిన్న పనికైనా అవి సర్కారు ఇచ్చే నిధుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 144 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో బిల్డింగ్ నిర్మాణ పర్మిషన్ల కోసం వేలల్లో అప్లికేషన్లు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ పర్మిషన్​లకు ల్యాండ్ వ్యాల్యూ ఆధారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. 

చిన్న ఇండ్లు కట్టుకోవాలన్నా వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు జనగామలో బతుకమ్మ కుంట ఏరియాలో ఓ వ్యక్తి 160 గజాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఇటీవల టీఎస్ బీపాస్ లో అప్లై చేసుకున్నాడు. రూల్స్​ మేరకు ఇతను ఎల్ఆర్ఎస్​, బిల్డింగ్ పర్మిషన్​కు కలిపి మొత్తంగా రూ. లక్షా 8 వేలు చెల్లించాడు. అట్లని ఫీజు ఒకే తీరుగా లేదు. ల్యాండ్ వ్యాల్యూ.. ఫ్లోర్ ల సంఖ్య, వైశాల్యం ఆధారంగా లక్షల్లో కట్టాల్సి వస్తోంది. 

ఇలా కోట్లాది రూపాయల ఆదాయం సర్కార్​కు వస్తోంది. గతంలో ఇవి మున్సిపాలిటీలు, పంచాయతీలకు వచ్చేవి కానీ కొత్తగా పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చాక ఈ ఆదాయం నేరుగా సర్కారు ఖజానాకే చేరుతోంది. ఇవే కాకుండా గతంలో వచ్చే స్టాంప్ డ్యూటీ, మ్యుటేషన్ల రుసుం కూడా రాష్ట్ర సర్కార్​కే పోతున్నాయి. బర్త్, డెత్, ట్రేడ్​ లైసెన్స్​ల ఫీజులుసర్కారు ఖాతాల్లోకే మళ్లుతున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఖాతాలు నిధులు లేక వెలవెల బోతున్నాయి.

ఇచ్చినప్పుడు తీసుకోవాలె

టీఎస్​ బీపాస్​కు ముందు లోకల్ ఫీజులు, రుసుములు స్థానిక ఖాతాల్లో జమయ్యేవి. ఆ నిధులతో లోకల్ గా అవసరమున్న డెవలప్ మెంట్ పనులను అక్కడి పాలక వర్గాలు తీర్మానాలు చేసుకుని చేపట్టేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. సర్కారే నేరుగా తన అకౌంట్లలోకి వేయించుకుని వాళ్లకు వీలున్నప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్​లు, పంచాయతీలకు ఎంతో కొంత ఇస్తున్నారు. 

ఉదాహరణకు 2021 సంవత్సరంలో ఖమ్మం జిల్లా కూసుమంచిలో 12 ఇండ్ల పర్మిషన్​కు గాను రూ.3,56,464 ఆన్ లైన్ లో చలానాగా చెల్లిస్తే వీటిలో రూ.1,35,164  మాత్రమే సర్కార్ తిరిగి గ్రామ పంచాయతీకి జమ చేసింది. ఇదే పంచాయతీ పరిధిలో 2022లో 11 ఇండ్లకు రూ.2,18,167లు చలానా ద్వారా చెల్లిస్తే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తిరిగి పంచాయతీ అకౌంట్​లో జమ చేయలేదు. ఈ పరిస్థితుల్లో పాలక వర్గాలు గవర్నమెంట్​ ఇచ్చే ఎస్ఎఫ్​సీ, పట్టణ, పల్లె ప్రగతి నిధుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. అవి కూడా ఏ టైమ్ కు వస్తాయనేది  క్లారిటీ ఉండడం లేదు.

పట్టణ ప్రగతి ఫండ్స్​ చాలట్లే..

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు పట్టణప్రగతి కింద సర్కారు ఇస్తున్న ఫండ్స్ ఏమూలకు సాల్తలెవ్వు. ప్రస్తుతం సెంట్రల్ నుంచి వచ్చే 15వ ఫైనాన్స్ కమిషన్, రాష్ట్రం ఇచ్చే స్టేట్​ఫైనాన్స్​కమిషన్ ఫండ్​ను కలిపి పట్టణ ప్రగతి కింద 141 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ప్రతి నెలా రూ.145 కోట్ల చొప్పున ఇస్తున్నారు. అంటే సగటున ఒక్కో యూఎల్బీకి రూ.కోటి కూడా రావడం లేదు. ఆస్తి పన్ను కూడా ఆశించిన స్థాయిలో వసూలు కావట్లేదు. 

దీంతో సరిపడా ఫండ్స్ లేక నగరాలు, పట్టణాల్లో మౌలికవసతుల సమస్య వేధిస్తోంది. ఏండ్లు గడుస్తున్నా అండర్ గ్రౌడ్ డ్రైనేజీలు, ఇంటర్నల్ రోడ్లు పూర్తికాక జనం ఇబ్బందులు పడుతున్నారు. చాలా మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ తవ్వకాలతో దెబ్బతిన్న రోడ్లను కూడా రిపేర్ చేయించలేని పరిస్థితి ఉంది. ఇక  కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాలు, ఇతర మున్సిపాలిటీల్లో బ్యూటిఫికేషన్​వక్క్స్ కింద మొదలుపెట్టిన డివైడర్లు, సర్కిళ్ల డెవలప్మెంట్, పార్కులు, ట్యాంక్​బండ్స్ లాంటి పనులు ఏండ్లు గడుస్తున్నా పూర్తికావట్లేదు.

పంచాయతీల్లోనూ అదే సీన్​.. 

గ్రామ పంచాయతీల ఆదాయ మార్గాలను ఒక్కొక్కటిగా సర్కార్​ చేజిక్కించుకొని ప్రతి అవసరానికీ తనపై ఆధారపడేలా చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లోని గ్రానైట్, ఇసుక క్వారీలు, క్రషర్ల (మైనింగ్​)ద్వారా గతంలో పంచాయతీలకు వచ్చే 25% సీనరేజీ ఫీజును ఆపేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పంచాయతీలకు వచ్చే ‘ట్రాన్స్​ఫర్ డ్యూటీ’ బంద్​పెట్టింది. పంచాయతీలకు మాత్రమే దక్కాల్సిన ఉపాధి హామీ నిధులపై కర్రపెత్తనం చేస్తోంది. ఫలితంగా గ్రామాల్లో చిన్నచిన్న పనులు కూడా చేయించలేకపోతున్న సర్పంచులు ప్రతిసారీ కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల కోసం ఎదురుచూస్తున్నారు.

కూసుమంచికి 4.39 లక్షల బకాయి

ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామంలో 2021లో 12 ఇండ్ల పర్మిషన్​కు గాను రూ. 3,56,464  టీఎస్​ బీపాస్ ద్వారా ఆన్ లైన్ లో చలానాలు చెల్లించారు. ఇందులో ప్రభుత్వం రూ.1,35,164 తిరిగి గ్రామ పంచాయతీకి జమ చేసింది. 2022లో 11ఇండ్లకు గాను రూ.2,18,167 సర్కార్​ఖాతాలో జమ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా రూ.4.39 లక్షల పంచాయతీకి రావాల్సి ఉంది.  జీపీ ఖాతాలో డబ్బులు లేక స్థానికంగా చిన్నచిన్న పనులు కూడా చేయలేకపోతున్నట్లు పాలక వర్గం సభ్యులు చెప్తున్నారు.

ఇలా నిధుల కటకటతో లోకల్​బాడీలు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండ డంతో డెవలప్ మెంట్ పనుల ఊసే లేకుండా పోతోంది. మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్​లలో అధికార, ప్రతిపక్ష సభ్యులు అనే తేడా లేకుండా అందరూ డెవలప్​ మెంట్ పనులపై నిలదీస్తున్నారు. రూలింగ్​పార్టీ లీడర్లంతా తప్పులను అధికారులపై నెడుతున్నారు. 

గతంలో మున్సిపల్ ఆదాయాల్లో ప్రధాన ఆదాయం బిల్డింగ్ నిర్మాణ అనుమతుల రూపంలో ఉండగా ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో తామేమీ చేయలేమని ఆఫీసర్లు వాపోతున్నారు. సర్కారు ఇచ్చే ఎస్ఎఫ్​సీ, పట్టణ ప్రగతి నిధుల పై ఆధార పడక తప్పడం లేదంటున్నారు.​ ఈ క్రమంలో ఎన్నో ఆశలతో ఏర్పాటైన పాలక వర్గాలు తమ పదవీకాలం ముగుస్తున్నా చేసిన అభివృద్ధి ఏమీ లేదనే ఆవేదనలో ఉంటున్నాయి.

జనరల్ ఫండే దిక్కు

ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపాలిటీలకు జనరల్ ఫండే దిక్కుగా మారింది. ఇంటి పన్నులు, నల్లా పన్ను, ఆస్తిపన్నుల​ వంటి నామమాత్రపు ఫండ్స్ మున్సిపల్ ఖాతాలకు వచ్చి చేరుతున్నాయి. వీటికి తోడు స్థానికంగా వేసే జరిమానాలు మరో ఆదాయ వనరుగా ఉంటున్నాయి. వీటిని ప్రతీ నెల మున్సిపల్ సిబ్బంది వసూలు చేసి జీతాలకు ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. ఉదాహరణకు జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ఇక్కడి జనాభా సుమారు లక్ష కు చేరింది. 

ఈ మున్సిపల్​ పరిధిలో 14 వేల ఇండ్లు, మూడు వేలకు పైగా వివిధ రకాల దుకాణాలు ఉంటాయి. ఇక్కడి మున్సిపాలిటీలో  177 మంది అవుట్​ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతీ రోజు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు పన్నుల వసూళ్లు జరుగుతాయి. ఈ లెక్కన నెలకు రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు వసూళ్లు అయితే ఇందులో రూ.20 లక్షలు జీతాలకే సరి పోతున్నాయి. కరెంట్ బిల్లులకు సుమారు రూ.5 లక్షలు ఖర్చు వస్తోంది. ఇతర నిర్వహణ ఖర్చుల కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది.