హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల వేళ తెలంగాణలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆదివారం (డిసెంబర్ 29) ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని నల్లబండగూడెం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చెక్ పోస్ట్ వద్ద రోజువారీ తనిఖీల్లో భాగంగా భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తోన్న బస్సులో ఎక్సైజ్ & ప్రొహిబిషన్ పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఈ క్రమంలోనే డ్రగ్స్‌ను చాక్లెట్ల రూపంలో మార్చి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు 1000 డ్రగ్ చాక్లెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్‌కి పంపించారు పోలీసులు. డ్రగ్స్ రవాణా చేస్తోన్న నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులను అందులోకి తీసుకొని బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనుమానిత వ్యక్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు. న్యూ ఇయర్ వేడుకల వేళ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.