
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, నోయిడా ప్రాంతాలు తుపాకుల మోతతో దద్దరిల్లాయి. కేవలం 12 గంటల వ్యవధిలోనే ఈ రెండు ప్రాంతాల్లో భారీ ఎన్ కౌంటర్లు జరిగాయి. పోలీసులు, గ్యాంగ్ స్టర్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు, రౌడీ షీటర్ హతం అయ్యాడు. మరో ఎన్ కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన జితేంద్ర అలియాస్ జీతుకు ఝజ్జర్‌లో 2016లో జరిగిన డబుల్ మర్డర్ కేసులో జీవిత ఖైదు పడింది.
దీంతో పాటుగా 2023లో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జీతు జైలుకు వెళ్లి అక్కడ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో పరిచయం పెంచుకున్నాడు. 2023లో పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన నిందితుడు తిరిగి జైలుకు వెళ్లకుండా బయటే తప్పించుకు తిరుగుతూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి పని చేయడం ప్రారంభించాడు. పరారీలో ఉన్న జీతు సమాచారం కోసం పోలీసులు రూ.1 లక్ష నజరానా ప్రకటించారు.
ఈ క్రమంలోనే జీతు మీరట్‌లో ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం రావడంతో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు తారసపడ్డ నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. తిరిగి పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో జీతు గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. ట్రీట్మెంట్ పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడని స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అదనపు డైరెక్టర్ జనరల్ అమితాబ్ యష్ వెల్లడించారు.
నోయిడాలో జరిగిన మరో ఎన్ కౌంటర్లో ఓ బ్యాంక్ ఉద్యోగి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 21న ఎకోటెక్-3 ప్రాంతంలోని డి పార్క్ సమీపంలో బ్యాంక్ ఉద్యోగి మంజీత్ మిశ్రా కాల్చి చంపబడ్డాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న నిందితుడు ప్రిన్స్ అలియాస్ బంటీని మంగళవారం (ఫిబ్రవరి 25) రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ II) శక్తి మోహన్ అవస్థి తెలిపారు.