గడ్చిరోలిలో ఎన్​కౌంటర్..నలుగురు మావోయిస్టులు మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా రేపనపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. 

మంచిర్యాల/మహదేవపూర్, వెలుగు: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహెరీ తాలూకా రేపనపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భారీ ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంగి–ఇంద్రవెల్లి ఏరియా కమిటీ సెక్రటరీ, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్​–మంచిర్యాల డివిజన్ కమిటీ మెంబర్ వర్గీశ్.. సిర్పూర్​– చెన్నూర్ ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తు.. ప్లాటూర్ మెంబర్స్ కుర్సింగ రాజు, కుడ్మెత వెంకటేశ్ ఉన్నట్టు గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ ప్రకటించారు. 

ఈ నలుగురు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాణహిత నది దాటి గడ్చిరోలి జిల్లాలోకి ప్రవేశించారని ఎప్పీ చెప్పారు. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో విధ్వంస కార్యకలాపాలకు పాల్పడే చాన్స్ ఉందని సమాచారం అందినట్టు తెలిపారు. ఈ మేరకు అహేరి పోలీస్ సబ్ డివిజన్ అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) యతీశ్ దేశ్​ముఖ్ ఆధ్వర్యంలో సీ60, సీఆర్పీఎఫ్, క్యాట్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయన్నారు. ఈ క్రమంలో రేపనపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో గల కోలమర్క గుట్టల్లో కూంబింగ్​చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు అకస్మాత్తుగా ఫైరింగ్ చేయడంతో ఎదురుకాల్పులు జరిపారని చెప్పారు. 

ఫైరింగ్ ముగిసిన తర్వాత ఆ ప్రాంతంలో పరిశీలించగా నలుగురి డెడ్​బాడీలు కనిపించినట్టు వెల్లడించారు. సంఘటన స్థలం నుంచి ఒక ఏకే 47, ఒక కార్బన్​ గన్, రెండు కంట్రీమేడ్ పిస్టల్స్, విప్లవ సాహిత్యంతో పాటు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురిపై మహారాష్ట్రలో రూ.36 లక్షల రివార్డు ఉన్నట్టు సమాచారం. మృతులంతా చత్తీస్​గఢ్​ రాష్ట్రానికి చెందిన వారని, కొంతకాలంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కార్యకలాపాలు సాగిస్తున్నారని తెలుస్తున్నది.

చత్తీస్​గఢ్​లో మరో మావోయిస్టు మృతి.. 

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ మావోయిస్టు చనిపోయాడు. కిరండోల్ పోలీస్ స్టేషన్​పరిధిలోని పురంగేల్–గంపూర్​గ్రామ అడవుల్లో డీఆర్జీ, బస్తర్​ఫైటర్స్ సంయుక్తంగా కూంబింగ్​కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. సంఘటన స్థలంలో మావోయిస్టు డెడ్​బాడీతో పాటు, తుపాకీ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పలువురు మావోయిస్టులు గాయాలతో అడవిలోకి పారిపోయారని పోలీసులు చెప్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.