ఇరాన్లో భారీ పేలుడు.. 25 మంది మృతి.. 800 మందికి పైగా గాయాలు

ఇరాన్లో భారీ పేలుడు.. 25 మంది మృతి.. 800 మందికి పైగా గాయాలు

మస్కట్: ఇరాన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ఇరాన్ లోని షాహీద్ రజాయే ఓడరేవులో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 25 మంది మృతిచెందారు. దాదాపు 800 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పేలుడు శబ్ధం దాదాపు 50 కిలో మీటర్ల వరకు వినిపించింది. బండర్ అబ్బాస్ సిటీకి వెలుపల షాహీద్ రజాయే పోర్టు ఉంటుంది. 

బాలిస్టిక్ క్షిపణుల్లో ఘనరూప ఇంధనంగా వాడే 'సోడియం పెర్ క్లోరేట్ రాకెట్ ఫ్యూయల్' గత నెలలో షాహీద్ రజాయే ఓడరేవులో దిగుమతి అయింది. చైనా నుంచి రెండు నౌకల్లో ఇది వచ్చింది.  పోర్టులో నిల్వ ఉన్న కొన్ని కంటైనర్లు పేలడంతో ప్రమాదం జరిగిందని స్థానిక విపత్తు నిర్వహణ అధికారి మెహర్దాద్ హసన్జాదే చెప్పారు. ఇక్కడ పేలుడు ఎలా సంభవించిందనేదానిపై అధికార వర్గాలు కొన్ని గంటలవరకు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. పేలుడు ధాటికి ఘటనాస్థలం నుంచి కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్న భవనాల అద్దాలు ధ్వంసమ్యాయి. 

ఓ బిల్డింగ్ కూలిపోయింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు హెలికాప్టర్లు, విమానాలతో నీటిని చిమ్మి మంటలను ఆర్పారు. పోర్టులో ఓ వ్యక్తి.. పారిపోండి.. గ్యాస్ ట్రక్కును వెళ్లిపొమ్మనండి. అది పేలిపోతోంది. అందరూ ఖాళీచేయండి.. అంటూ పెద్దగా అరిచిన కాసేపటికే పేలుడు చోటుచేసుకుంది. ఓ వైపు అణ్వాయుధాలపై ఇరాన్, అమెరికా ఒమన్ లో మూడోవిడత చర్చలు జరుపుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, దీనివెనుక విద్రోహ చర్య ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా.. ఇది దాడి కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పష్టం చేశారు. తమ భద్రతా సేవలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు.