ఇండియా, పాక్ బార్డర్‎లో భారీ పేలుడు.. ఇద్దరు భారత సైనికుల వీరమరణం

ఇండియా, పాక్ బార్డర్‎లో భారీ పేలుడు.. ఇద్దరు భారత సైనికుల వీరమరణం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో భారీ పేలుడు సంభవించింది. అఖ్నూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలో ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలి ఇద్దరు భారత జవాన్లు మృతి చెందారు. మరికొందరు సైనికులు గాయపడ్డారు. ఎల్‌ఓసీ వద్ద పేలుడికి కారణమైన ఐఈడీ ఉగ్రవాదులు అమర్చినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. అఖ్నూర్ సెక్టార్‌ భట్టల్ ప్రాంతంలోని ఒక ఫార్వర్డ్ పోస్ట్ సమీపంలో భద్రత దళాలు రోజువారీ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. 

ఈ క్రమంలో మంగళవారం (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో జవాన్లు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందారు. ఇందులో ఒకరు సైనికాధికారి కాగా.. మరొకరు జవాన్ అని అధికారులు తెలిపారు. మరో సైనికుడు తీవ్రంగా గాయపడటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీనే పేలుడికి కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఐఈడీ పేలుడు నేపథ్యంలో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పూర్తిగా ఘటన స్థలాన్ని స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టారు. ఇద్దరు భారత సైనికుల మరణాన్ని వైట్ నైట్ కార్ప్స్ ధృవీకరించింది. ఈ మేరకు వీర జవాన్లకు నివాళులర్పించింది. ఘటన స్థలంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది.