- బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘటన
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏడు అంతస్తుల షాపింగ్ మాల్‌లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 46 మంది చనిపోయారు. మరో 22 మంది గాయపడ్డారు. గాయపడినవారు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మంటల్లో చిక్కుకున్న మరో 75 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
బెయిలీ రోడ్ ఏరియాలోని గ్రీన్ కోజీ కాటేజ్ షాపింగ్ మాల్ బిల్డింగులో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు శుక్రవారం వెల్లడించారు. మాల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కచ్చి భాయ్ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయని.. క్రమంగా బిల్డింగ్ అంతా వ్యాపించాయని చెప్పారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు.13 ఫైర్ సర్వీస్ యూనిట్లతో రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చామన్నారు. చనిపోయినవారిలో ఇప్పటి వరకు 39 మందిని గుర్తించామని.. అందులో 31మంది డెడ్ బాడీలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు తెలిపారు.
ఇంకా ఆరుగురు మృతుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మిగిలిన డెడ్ బాడీలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి.. ఫ్యామిలీలకు అప్పగిస్తామని పేర్కొన్నారు. ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మాల్‌లో ఫైర్ ఎగ్జిట్ లేదని హసీనా తెలిపారు. నిబంధనల ప్రకారమే బిల్డింగులను నిర్మించాలని ప్రజలను కోరారు. అగ్ని ప్రమాదంలో 46 మంది మరణించడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.