వరంగల్ లోని అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఉన్న స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల వారిని పోలీసులు ఖాళీ చేయించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగాయని ఫైర్ ఆఫీసర్ భగవాన్ రెడ్డి చెప్పారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో 9 షాపులకు మంటలు అంటుకున్నాయన్నారు. నివాస గృహాలకు మంటలు విస్తరించడంతో స్థానికులను పోలీసులు ఖాళీ చేయించారని తెలిపారు. మొత్తం ఏడు ఫర్నిచర్ షాప్ లతోపాటు ఫర్టిలైజర్ షాప్, పాత ఇనుప సామాను షాపులు అగ్నికి ఆహుతయ్యాయని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఆరు ఫైరింజన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. నివాస గృహాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా ఫర్నిచర్ షాపులు వెలసినట్టు తెలుస్తోంది. ఇలాంటి దుకాణాలన్నీ ఒకే చోట ఉండడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు సమాచారం. అగ్ని ప్రమాద ప్రదేశంలోనే పిల్లల హాస్పిటల్, లిక్కర్ షాప్ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సరైన నిబంధనలు పాటించకపోవడంతోనే అగ్ని ప్రమాదానికి కారణమైనట్టు సమాచారం. కాగా నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.