కాలిఫోర్నియాలో కార్చిచ్చు

 కాలిఫోర్నియాలో కార్చిచ్చు
  • 10 వేల మందిని తరలించిన అధికారులు

వాషింగ్టన్:  అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజెలిస్ సమీపంలో భారీ కార్చిచ్చు మొదలైంది. బుధవారం సాయంత్రం కార్చిచ్చు కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బలమైన గాలుల తాకిడికి అవి వేగంగా వ్యాపిస్తున్నాయి. మొదట కిలోమీటరు విస్తీర్ణంలో మొదలైన మంటలు గంటల వ్యవధిలోనే 62 కిలోమీటర్ల వరకు వ్యాపించాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. లాస్ ఏంజెలిస్ సమీపంలోని దాదాపు 10 వేల మందిని అధికారులు ఖాళీ చేయించారు.

మూడువేలకు పైగా నివాస ప్రాంతాలు, నిర్మాణాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండటంతో వారిని తరలిస్తున్నామని తెలిపారు. కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోందని, సమీప ప్రాంత ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని వెంచురా కౌంటీ అధికారులు సూచించారు. మరోవైపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో 30 వేల మందికిపైగా స్థానికులు చీకటిలో మగ్గిపోతున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.