ఉప్పొంగుతున్న కృష్ణా, గోదావరి..రికార్డు స్థాయిలో వరద

ఉప్పొంగుతున్న కృష్ణా, గోదావరి..రికార్డు స్థాయిలో వరద
  • ఈసారి ప్రధాన నదులకు రికార్డు స్థాయిలో వరద
  • మూడు నెలల్లో గోదావరి నుంచి 1,860 టీఎంసీలు సముద్రంలోకి
  • గడిచిన 55 రోజుల్లో  శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,150 టీఎంసీలు
  • కృష్ణాకు15 ఏండ్ల తర్వాత ఇదే భారీ ఇన్​ఫ్లో 
  • ఈ ఏడాది తాగు, సాగు అవసరాలకు డోకా లేనట్లే.. 

మహబూబ్​నగర్/శ్రీశైలం/భూపాలపల్లి, భద్రాచలం, వెలుగు : ‘కృష్ణాకు భారీ వరద వస్తే గోదావరికి రాదు.. గోదావరికి భారీ వరద వస్తే కృష్ణాకు రాదు..’ రాష్ట్రంలోని రెండు ప్రధాన నదులకు సంబంధించి కొన్నేండ్లుగా వినిపిస్తున్న మాట ఇది. కానీ ఈ ఏడాది సీన్​ రివర్స్​అయింది. భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా కొద్దిరోజులుగా ఈ రెండు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

గడిచిన మూడు నెలల్లో గోదావరి నుంచి 1,860 టీఎంసీలు సముద్రం పాలవగా,  గత 55 రోజుల్లో  శ్రీశైలం ప్రాజెక్టులోకి ఏకంగా 1,150 టీఎంసీల వాటర్​ వచ్చినట్లు లెక్కలు చెప్తున్నాయి. రెండు ప్రధాన నదులకు భారీ వరదల కారణంగా వీటిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. దీంతో ఈ ఏడాదంతా సాగు నీటికి, రాబోయే రెండేళ్లపాటు తాగునీటికి  ఢోకా లేనట్లేనని ఇరిగేషన్​ ఆఫీసర్లు చెప్తున్నారు.

15 ఏండ్ల తర్వాత  శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. 

2009లో కృష్ణాకు భారీ వరద వచ్చింది. ఆ ఏడాది అక్టోబర్ లో కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 23 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చింది. నెల రోజుల పాటు నిరంతరాయంగా వరద కొనసాగింది. ఆ నెలలో మొత్తం ప్రాజెక్టుకు 2,800 టీఎంసీల మేర నీరు రావడంతో గేట్లు ఎత్తిఉంచి  వచ్చిన నీటిని వచ్చినట్లు కిందికి వదిలారు.  ఆ తర్వాత  గడిచిన 15 ఏండ్లలో ఆ స్థాయి వరద రాలేదు.

ఈ ఏడాది మాత్రం 55 రోజుల్లోనే దాదాపు 1,150 టీఎంసీల నీరు వచ్చి చేరింది.  జూలై 19 నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రారంభం కాగా.. 33 టీఎంసీల నీటి నిల్వతో డెడ్​ స్టోరేజీలో ఉన్న ప్రాజెక్టు అదే నెల 29 నాటికి ఫుల్​ కెపాసిటీకి చేరుకుంది. ప్రాజెక్టు ఫుల్​ కెపాసిటీ 215.80 టీఎంసీలకు గాను దాదాపు 212 టీఎంసీలకు చేరుకోవడంతో అదే రోజు సాయత్రం నుంచి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు. జూలై 31 నుంచి ప్రాజెక్టు 12 గేట్లకు గాను,పది గేట్లను ఆరు రోజుల పాటు తెరిచే ఉంచారు. గత నెల 14న ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో గేట్లను బంద్​ చేశారు.

కానీ, మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా అదే నెల చివరి వారం నుంచి ఇప్పటి వరకు వరద కొనసాగుతూనే ఉంది. కృష్ణా, తుంగభద్ర నదుల ద్వారా మంగళవారం నాటికి ప్రాజెక్టుకు 1,150 టీఎంసీల నీరు చేరింది. అందులో 107 టీఎంసీలను సాగునీటి ప్రాజెక్టులకు విడుదల చేశారు. మిగతా జలాలను విద్యుత్​ ఉత్పత్తి, స్పిల్​వే ద్వారా దిగువకు విడుదల చేశారు. 

 డేంజర్‌‌‌‌ జోన్‌‌‌‌లో ములుగు, భద్రాద్రి జిల్లాలు.. 

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, సమ్మక్క బ్యారేజీల గేట్లు ఓపెన్‌‌‌‌ చేసి ఉంచడంతో ప్రాణహిత, ఇంద్రావతి, మానేరు వాగుల నుంచి వచ్చే వరదతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గోదావరి తీర ప్రాంతాల్లో ఆఫీసర్లు హై అలర్ట్​ ప్రకటించారు. రామన్నగూడెం వద్ద మంగళవారం ఉదయం 14.830 మీటర్లు దాటింది.

భద్రాచలం వద్ద గోదావరి మంగళవారం సాయంత్రం 5గంటలకు 48.2 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగపేట మండలం పోదుమూరు, తురకవాడ గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి 24 గంటల్లో 20 అడుగులు పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దిగువన శబరి, సీలేరు నదుల ఉధృతితో పోలవరం బ్యాక్​ వాటర్​తో భద్రాచలం వద్ద గోదావరికి ఎదురు పోటొచ్చింది.

దీంతో భద్రాద్రి కలెక్టర్​ జితేంద్ర వి పాటిల్, ఐటీడీఏ పీవో బి.రాహుల్​ వరద తీవ్రతను పరిశీలించిన అనంతరం ఆర్డీవో ఆఫీస్​లో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి రివ్యూ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్  చేసినట్లు కలెక్టర్  తెలిపారు. వరద ప్రభావిత మండలాల్లో పునరావాస కేంద్రాలను సిద్దం చేసి ఉంచాలని కలెక్టర్​ ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్​ టీంలు, గత ఈతగాళ్లు, మెడికల్​ టీంలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ సూచించారు.

చత్తీస్‌‌‌‌ గఢ్‌‌‌‌ రూట్‌‌‌‌ చేంజ్‌‌..‌‌

ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు వద్ద హైదరాబాద్‌‌‌‌–భూపాలపట్నం 163 హైవేపైకి గోదావరి నీళ్లు వచ్చాయి. రేగుమాకు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జిల్లా పోలీసులు రోడ్డును మూసేసి రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు. భూపాలపల్లి, కాటారం, మహదేవ్‌‌‌‌ పూర్  మీదుగా చత్తీస్‌‌‌‌ గఢ్‌‌ రాష్ట్రానికి వెళ్లాలని సూచించారు. వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం, కొండాపురం గ్రామాల సమీపంలో ఆర్అండ్‌‌బీ‌‌ రోడ్డుపైకి గోదావరి వరద రావడంతో -భద్రాచలం, -వెంకటాపురం వైపు రాకపోకలు స్తంభించాయి.

ఉప్పొంగుతున్న గోదావరి

ఎగువన పడుతున్న భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది.  గోదారికి ఉపనది అయిన ఇంద్రావతి నుంచి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో ఆదిలాబాద్‌‌‌‌ నుంచి భూపాలపల్లి జిల్లా వరకు ప్రశాంతంగా ప్రవహిస్తున్న గోదావరి ములుగు జిల్లా నుంచి వేగం పెంచింది. మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ వద్ద 4.51 లక్షల క్యుసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో ఉంటే సమ్మక్క సాగర్‌‌‌‌ (తుపాకుల గూడెం) బ్యారేజీ వద్ద 10.21 లక్షల క్యుసెక్కులకు పెరిగింది. టేకులగూడెం వద్ద ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ 163 రోడ్డుపైకి వరద నీళ్లు రావడంతో చత్తీస్‌‌‌‌ గఢ్‌‌‌‌ రాష్ట్రం నుంచి రాకపోకలను పోలీసులు బంద్‌‌‌‌ చేశారు.

దీంతో అప్రమత్తమైన ఆఫీసర్లు ములుగు జిల్లాలోని రామన్నగూడెం, భద్రాచలం వద్ద ఆఫీసర్లు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వానాకాలం మొదలైనప్పుడు నీళ్లు లేక వెలవెలబోయిన గోదావరి గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉరకలెత్తుతోంది.  గడిచిన మూడు నెలల్లో 1,860 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లిపోయాయి.