సొంతింటి కల నేరవేరుతుందని ఆశపడిన నిరుపేదల నుంచి భారీగా డబ్బులు దోచుకుని మోసం చేసిన ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది. దళారుల మాయ మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో డబుల్ దందా బయటపడింది. ఖమ్మంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని వందల మందిని నుంచి సుమారు రూ. 4 కోట్ల వసూలు చేశారు. ఇందులో పాత్రదారులు షేక్ షకీనాబేగం, బోలేపల్లి లక్ష్మీ కాగా.. ప్రధాన సూత్రదారులు మాత్రం అధికార పార్టీకి చెందిన వారిగా బాధితులు ఆరోపిస్తున్నారు.
ఖమ్మంలో టీచర్ గా పనిచేస్తున్న షేక షకీనాబేగం, పుట్టకోటలో పనిచేస్తున్న బోలేపల్లి లక్ష్మీ.. నగరంలోని పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని వందల మంది నుంచి సుమారు రూ. 4 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశారు. అయితే బాధితులు డబ్బులు కట్టినప్పటి నుంచి ఇండ్లు ఇప్పిస్తామంటూ సదరు మహిళలు తప్పించుకొని తిరుగుతున్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. తమ వద్ద ఒక్క రూపాయి కూడా లేదని నిందితులు చెబుతున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే వీరిద్దరితో పాటు అధికార పార్టీకి చెందిన నేతలు కూడా ఈ దందా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇద్దరు నిందితులను రిమాండ్ చేయద్దని.. బాధితులకు అప్పగించాలని బాధితులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. తమ సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో.. కొందరు డబ్బులు లేకపోయినా అప్పు తెచ్చి మరి డబ్బులను వారిద్దరికీ కట్టామని కన్నీరు పెట్టుకున్నారు. మరికొందరు పోలీసుల వాహనంలో నిందితులను తీసుకెళ్తుండగా.. బాధితులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.