
- జీతాలు, అభివృద్ధి పనులకు రూ.48 కోట్ల కేటాయింపులు
- ఇన్ ఫ్రాస్ర్టక్చర్ లా, ఇంజనీరింగ్ కాలేజీల బిల్డింగులు, హాస్టళ్ల నిర్మాణాలకు సరిపడా ఫండ్స్
- బీఆర్‌ఎస్ హయాంలో 2019 నుంచి జీతాలకే బడ్జెట్‌లో కేటాయింపులు
మహబూబ్‌నగర్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్‌లో పాలమూరు యూనివర్సిటీకి పదేండ్ల తర్వాత భారీగా నిధులను కేటాయించారు. ఈ ఫండ్స్ తో రానున్న అకడమిక్ ఇయర్ నుంచి లా, ఇంజనీరింగ్ కాలేజీల బిల్డింగులు, హాస్టళ్లు, బాయ్స్, గర్ల్స్కొత్త హాస్టళ్ల నిర్మాణాలకు పునాదులు పడనున్నాయి.
కాంగ్రెస్ హయాంలోనే నిధులు..
2023లో రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. వర్సిటీకి ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (పీఎం యూఎస్‌హెచ్‌ఏ) కింద ఎంపిక చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో 2024 ఫిబ్రవరిలో ఈ స్కీం కింద వర్సిటీకి రూ. వంద కోట్లు మంజూరయ్యాయి. ఈ ఫండ్స్ ద్వారా వర్సిటీలో కొత్తగా రూ.20 కోట్లతో గర్ల్స్, బాయ్స్ హాస్టళ్లు, ఇతర అకడమిక్ బిల్డింగులు, స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్ పనుల కోసం వెచ్చించారు. అదే ఏడాది జరిగిన రాష్ర్ట బడ్జెట్‌లో ప్రభుత్వం వర్సిటీలోని సిబ్బంది జీతాల కోసం రూ.10 కోట్లు కేటాయించింది. ఇటీవల వర్సిటీకి లా, ఇంజనీరింగ్ కాలేజీలు మంజూరు అయ్యాయి. ఈ కాలేజీలను వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రారభించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం.. వర్సిటీలో అందుబాటులో ఉన్న స్థలంలో ఈ కాలేజీల బిల్డింగులు, వీటికి సంబంధించిన ఇతర ఇన్ఫ్రాస్ర్టక్టర్ నిర్మాణాల కోసం స్థల పరిశీలనలు పూర్తి చేసింది. బడ్జెట్ లేకపోవడంతో నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. అయితే తాజా బడ్జెట్‌లో వర్సిటీ కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. పలు డెవటప్మెంట్ పనుల కోసం దాదాపు రూ.200 కోట్లతో ప్రతిపాదనలు పంపించగా.. రాష్ర్ట ప్రభుత్వం ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని తాజా బడ్జెట్‌లో రూ.48 కోట్ల కేటాయింపులు చేసింది. అందులో రూ.36 కోట్లు లా, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర అవసరాలకు.. మరో రూ.12 కోట్లు సిబ్బంది జీతభత్యాల కోసం మంజూరు చేసింది.
నిధులు వచ్చిన వెంటనే వర్సిటీలో ఈ నిర్మాణాలను ప్రారంభించనున్నారు. నాలుగు నెలల టార్గెట్ పెట్టుకొని.. యుద్ధ ప్రాతిపతికను పనులు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా 2013లో అప్పటి ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ సీఎంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పీయూను సందర్శించి రూ.16 కోట్లు డెవలప్మెంట్ కోసం ఫండ్స్ రిలీజ్ చేశారు. మళ్లీ పదేండ్లకు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్‌లోకి రాగానే పీయూకు ప్రాధాన్యత ఇచ్చింది. వర్సిటీ డెవలప్మెంట్ కోసం తాజా బడ్జెట్‌లో రూ.48 కోట్లు కేటాయించడం పట్ల పీయూ సిబ్బంది, స్టూడెంట్లు సంతోషంలో ఉన్నారు.
ఏడేండ్లలో రెండు సార్లే..
తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాటు పాలమూరు వర్సిటీ డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టలేదు. మొదటి మూడేళ్లు నామమాత్రంగా నిధులు కేటాయింపులు చేసింది. ఆ తర్వాత 2017 నుంచి 2023 వరకు జరిగిన బడ్జెట్లలో జీతాల కోసం రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల చొప్పున కేటాయింపులు చేసింది. ఈ ఆరేండ్లలో డెవలప్మెంట్ కోసం కేవలం రూ.8 కోట్ల నిధులు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించింది. అయితే 2017లో న్యాక్ గుర్తింపు రావడంతో.. అదే ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి వర్సిటీకి రూ.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ ఫండ్స్‌తోనే వీసీ రెసిడెన్సీ, గెస్ట్ హౌస్, మోడల్ ఎగ్జామినేషన్ బ్రాంచ్, గద్వాలలో బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లు, వనపర్తిలో బాయ్స్‌హాస్టల్, కొల్లాపూర్‌లో అకాడమిక్ బిల్డింగ్‌తో పాటు యూనివర్సిటీలో 20 ఫీట్ల రోడ్లు, ఆర్చి గేటు, పీయూ చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది ఫీట్ల ఎత్తులో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు వినియోగించారు.
ఆరేళ్లుగా పీయూకు బడ్జెట్ కేటాయింపులు ఇలా (కోట్లల్లో..)
ఏడాది ప్రతిపాదన కేటాయింపులు
2019-20 119 6.63
2020-21 216 7.36
2021-22 137 7.58
2022-23 75 9.58
2023-24 84 10.91
2024-25 200 48