తొలి ఏడాదిలోనే భారీగాపెట్టుబడులు

  • దావోస్​లో ఒప్పందం కుదిరిన17 ప్రాజెక్టుల పనులు షురూ 
  • సీఎంకు వివరించిన అధికారులు
  • రాష్ట్ర ఇండస్ట్రియల్​ పాలసీ అందరిని ఆకర్షిస్తున్నది: సీఎం రేవంత్​
  • ఎకానమీని అభివృద్ధి, సంక్షేమం నిలబెట్టాయని వెల్లడి
  • ఈ నెల 16 నుంచి 22 వరకు సీఎం విదేశీ పర్యటన

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్​కు అధికారులు వివరించారు. నిరుడు దావోస్​ పర్యటనలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఏయే కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించాయి? అవి ఏయే దశలో ఉన్నాయి? అని అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదరగా.. వీటిలో దాదాపు 17  ప్రాజెక్టుల పనులు ప్రారంభం అయ్యాయని అధికారులు వెల్లడించారు. 10 ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయని, 7 ప్రాజెక్టుల అమలు ప్రారంభ దశలో ఉందని వివరించారు.  జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో పరిశ్రమల శాఖపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 20 నుంచి దావోస్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడుల సమీకరణ, వాటి పురోగతిపై చర్చించారు.

‘‘నిరుడు  దావోస్​లో జరిగిన వరల్డ్ ఎకనామిక్​ఫోరమ్​ సదస్సులో  చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.40, 232 కోట్ల పెట్టుబడులు  వచ్చాయి.  ఇందులో14  ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి’’ అని అధికారులు వివరించారు. కంపెనీలవారీగా పురోగతిని  మంత్రి శ్రీధర్ బాబు తో సీఎం చర్చించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇండస్ట్రియల్​పాలసీ అందరినీ ఆకర్షిస్తున్నదని తెలిపారు. తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి పనులన్నీ తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయని అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ  గమ్యస్థానంగా మారిందని,  దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నదని చెప్పారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉన్నదని తెలిపారు. ఫ్యూచర్ సిటీగా వెలుగొందుతున్న హైదరాబాద్ లో ఉన్న సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను  ఆదేశించారు.  ఈ సమావేశంలో  సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.  

16 నుంచి సీఎం విదేశీ టూర్​

ఈ నెల 16 నుంచి సీఎం రేవంత్​ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు దావోస్ లో పర్యటించనున్నారు.  సీఎంతోపాటు మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెంట వెళ్తున్నారు. సింగపూర్ లో స్కిల్ యానివర్సిటీకి సంబంధించిన ఒప్పందాలతోపాటు ఇతర పెట్టుబడులకు పలు సంస్థలతో సంప్రదింపులు జరుపుతారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ ఆరు రోజుల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్​తోపాటు అక్కడ జరిగే సదస్సులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశాల ప్రణాళికను సీఎం రేవంత్​కు అధికారులు వివరించారు. ఇక మంగళవారం సీఎం రేవంత్​ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 15వ తేదీ కూడా అక్కడే ఉండి.. అటు నుంచే సింగపూర్​కు పయనమవుతారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.