
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్కు భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ పోస్టులు భర్తీ కానున్నాయి. తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది. టెన్త్ క్వాలిఫికేషన్‌తో సెంట్రల్ కొలువుకు అవకాశం ఉన్న ఈ నియామక ప్రక్రియ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిపరేషన్ విధానం తెలుసుకుందాం..
బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ తదితర సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌తోపాటు, ఎన్ఐఏ, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్, అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పోస్టుల రిక్రూట్మెంట్కు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ విడుదల చేసింది. మొత్తం కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ)/ రైఫిల్‌మ్యాన్(జనరల్ డ్యూటీ) 26,146 పోస్టులు ఉన్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్): 6,174, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్): 11,025, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్): 3,337, సశస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ): 635, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ): 3,189, అస్సాం రైఫిల్స్(ఏఆర్): 1,490, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్‌ఎస్‌ఎఫ్): 296 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
సెలెక్షన్ ప్రాసెస్
కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ ఇలా ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ఎగ్జామ్ డ్యురేషన్ గంటన్నర. జనరల్, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు కటాఫ్ మార్క్స్ 35 శాతం కాగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 33 శాతం.
సిలబస్ అండ్ ప్రిపరేషన్
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్: సంఖ్యావ్యవస్థ, పూర్ణాంకాలు, దశాంశాలు, భిన్నాలు, ప్రాథమిక గణిత ప్రక్రియలు, పర్సంటేజీలు, నిష్పత్తి అనుపాతం, లాభ నష్టాలు, వడ్డీ, డిస్కౌంట్, కాలం–దూరం, కాలం–నిష్పత్తి, కాలం–పని తదితర బేసిక్ గణిత అంశాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అభ్యర్థులు 4 నుంచి 10 వరకు అకడమిక్ బుక్స్ ప్రిపేరవ్వాల్సి ఉంటుంది.
జనరల్ అవేర్‍నెస్
జనరల్ అవేర్‍నెస్ విభాగం చాలా విస్తృతమైనది. కరెంట్ అఫైర్స్ లో అంతర్జాతీయ, జాతీయ అంశాలు, క్రీడలు, వార్తల్లోని వ్యక్తులు, నియామకాలు, అవార్డులు, సదస్సులు, పథకాలు వంటి సమాచారాన్ని కనీసం మూడు నెలల ముందు నుంచి తప్పకుండా చదవాలి. జనరల్ నాలెడ్జ్ లో దేశాల రాజధానులు, కరెన్సీలు వివిధ దేశాల అధిపతులు, దినోత్సవాలు, పదజాలాలు, నదీతీర నగరాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రధాన సరిహద్దు రేఖలు, వివిధ రంగాల్లో ప్రథములు, ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, ప్రముఖుల బిరుదులు, మారుపేర్లు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వంటి సమాచారాన్ని చదవాలి
ఖండాలు, సరస్సులు, నదులు, సముద్రాలు, గ్రహాలు, దేశాల సరిహద్దులు, ప్రాజెక్టులు వంటి జియోగ్రఫీ అంశాలు ముఖ్యమైనవి. చరిత్రలో బ్రిటిషు పాలన, స్వాతంత్ర్య పోరాటం, బ్రిటిషు గవర్నర్ జనరల్స్, స్వాతంత్ర్య సమరయోధులు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇండియన్ పాలిటీలో వర్తమాన రాజకీయ అంశాలతో ముడిపెట్టి ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు ప్రభుత్వంలో తాజా నియామకాలు, రాజకీయ పరిణామాలు, పథకాలు, చట్టాలు, బిల్లులు వంటి వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ల నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. నిత్యజీవితంలో ఎదురయ్యే సైన్స్ అంశాలైన రసాయనాలు, భౌతిక సూత్రాలు, శరీరధర్మ శాస్ర్తం, వ్యాధులు, వైరస్‍లు, మొక్కలు - ఉపయోగపడే భాగాలు వంటి అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలుంటాయి కాబట్టి వీటికి ఎన్‌సీఈఆర్‌టీ 8, 9, 10 పదోతరగతి పుస్తకాలను చదవాలి.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్
ఈ విభాగంలో వర్బల్, నాన్‍వర్బల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అనాలజీస్ (నంబర్, ఫిగర్), సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లం సాల్వింగ్, అనాలసిస్, డ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమొరీ, అర్థమెటిక్ రీజనింగ్, డైరెక్షన్స్, కోడింగ్-డీకోడింగ్, రక్త సంబంధాలు, అరేంజ్‌మెంట్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్, దిక్కులు-దూరాలు, వెన్ డయాగ్రమ్స్, పజిల్స్ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. దీనికి ఆర్‍ఎస్ అగర్వాల్ రీజనింగ్ పుస్తకంతో పాటు ఎస్సెస్సీ ఇతర పరీక్షల ప్రీవియస్ పేపర్లు సాధన చేయడం వల్ల క్వశ్చన్ ప్యాటర్న్ తెలుస్తుంది. ఈ విభాగంలో ప్రాక్టీస్ తో నే మంచి మార్కులు సాధ్యమవుతాయి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్
ఇంగ్లీష్ సబ్జెక్టు నుంచి 100 మార్కులుంటాయి కాబట్టి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా 15 మార్కులకు ఉండే కాంప్రహెన్సన్ ప్యాసేజ్ ల్లో మంచి మార్కులు రావాలంటే ఇంగ్లీష్ పేపర్లలో ఎడిటోరియల్స్ చదవాలి. ప్రముఖ మేగజీన్‍లలోని వ్యాసాలు చదివితే బెటర్. తర్వాత 20 మార్కులకు ఉండే క్లోజ్ టెస్ట్ కు కూడా ఈ వ్యాసాలు ఉపయోగపడతాయి. ఈ సబ్జెక్టులో అత్యధిక మార్కులు స్కోర్ చేయగలిగే సెక్షన్ క్లోజ్ టెస్ట్. టెన్సెస్ ను బాగా చదవడం వల్ల సెంటెన్స్ కరెక్షన్ టాపిక్‍లో 10 కి 10 మార్కులు పొందే అవకాశం ఉంది.
వీటితో పాటు గ్రామర్, ఆంటోనిమ్స్, సినానిమ్స్, ఆర్టికల్స్, వాయిస్, ప్రిపొజిషన్స్, టెన్సెస్, వంటి వాటి నుంచి పదోతరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. సబ్జెక్టుపై అభ్యర్థులకు ఉండే పరిజ్ఞానాన్ని పరీక్షించడంతో పాటు రైటింగ్ ఎబిలిటీని కూడా పరీక్షిస్తారు. వొకాబులరీతో పాటు గ్రామర్ పెంచుకోవాలంటే ఇంగ్లీష్ పేపర్ చదవడం, న్యూస్ వినడం ఉత్తమ మార్గం. దీంతో పాటు ప్రీవియస్ పేపర్లలో వచ్చిన ప్రశ్నలను రాసుకొని ఒక స్టాండర్డ్ పుస్తకం చదివితే సరిపోతుంది. డిక్షనరీ సహాయంతో చదువుతూ రోజుకు కొన్ని కొత్త పదాలు, వాక్యాలు సాధన చేయాలి.
నోటిఫికేషన్
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు. వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఫిబ్రవరి లేదా మార్చిలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.