
- లక్షల్లో ‘రేషన్’ అప్లికేషన్లు.. పరిశీలనకు పాట్లు
- అదనపు సిబ్బందిని ఇవ్వండంటూ బల్దియా, రెవెన్యూ శాఖలకు సీఆర్ఓ లెటర్
- ప్రజాపాలనలో 5.40లక్షల అప్లికేషన్లు
- కులగణనలో మరో 84 వేలు.. ఇప్పటికే మీ సేవ ద్వారా1.62 లక్షల అప్లికేషన్లు
- తొమ్మిది సర్కిళ్లలో రోజూ 10 వేల దరఖాస్తులకు తక్కువ వస్తలేవు
హైదరాబాద్‌సిటీ, వెలుగు:గ్రేటర్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. వీటిని పరిశీలించి అర్హులను గుర్తించడంలో పౌరసరఫరాల శాఖ అధికారులు అవస్థలు పడుతున్నారు. సరైన సిబ్బంది లేకపోవడంతో వచ్చిన దరఖాస్తులను వెరిఫై చేయడానికి చాలా టైం పడుతోందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులతో పాటు, కులగణనలో వచ్చినవి, తాజాగా మీసేవా కేంద్రాల నుంచి వస్తున్న అప్లికేషన్లను పరిశీలించడానికి సీఆర్ఓ పరిధిలోని తొమ్మిది సర్కిళ్లలో ఉన్న సిబ్బంది సరిపోవట్లేదు.
మరో పక్క ప్రభుత్వం రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించడంతో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరూ తమకు ఇంకా కార్డు రాలేదంటూ సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు. పరిశీలన చేస్తున్న దరఖాస్తుల కంటే వస్తున్న అప్లికేషన్ల సంఖ్యనే ఎక్కువగా ఉంటోందని, దీంతో కొత్తకార్డుల జారీ ప్రక్రియ ఆలస్యమవుతుందంటున్నారు.
కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన కార్యక్రమం పెట్టి రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు తీసుకుంది. దీంతో 5.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటి స్క్రూటినీ పూర్తికాక ముందే కులగణనలో మరో 84వేల దరఖాస్తులు వచ్చాయి. అవి పరిశీలిస్తుండగానే మళ్లీ మీ సేవ ద్వారా కూడా కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. రోజూ వేల సంఖ్యలో అప్లికేషన్లు వస్తుండడంతో సివిల్సప్లయీస్అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
నెల రోజుల్లోనే మీ సేవా సెంటర్ల ద్వారా 1.62 లక్షల దరఖాస్తులు వచ్చాయని జిల్లా సివిల్సప్లయీస్ఆఫీసర్రమేశ్తెలిపారు. ఇవి కాకుండా తొమ్మిది సర్కిల్స్‌లో రోజూ 10వేల దరఖాస్తులు వస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకూ వచ్చిన లక్షల దరఖాస్తుల్లో రెండు మూడుసార్లు దరఖాస్తు చేసుకున్న వారే ఎక్కువగా ఉన్నారని తెలియజేశారు.
ముందు వీటిని స్క్రూటినీ చేయాల్సి ఉంటుందని, దీని కోసం బల్దియా, కలెక్టరేట్ల నుంచి సిబ్బందిని కేటాయించాలని సీఆర్ఓ ఇప్పటికే లెటర్లు రాశారు. ఆయా శాఖల సిబ్బందికి రేషన్ కార్డుల దరఖాస్తులను వెరిఫై చేసిన అనుభవం ఉండడంతో తమకు అదనపు సిబ్బందిని కేటాయిస్తే రేషన్ కార్డుల వెరిఫికేషన్ ను తొందరగా పూర్తి చేస్తామంటున్నారు.