న్యూఢిల్లీ:విదేశీ ఆటోమొబైల్, కాంపోనెంట్ తయారీ కంపెనీలు తమ భారతదేశ యూనిట్ల విస్తరణ కోసం భారీ ఎత్తున ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అందుకే ఇంజినీరింగ్, రీసెర్చ్ అండ్ డిజైన్, ఐటీ వంటి రంగాల్లో ఈ ఏడాది స్పెషలైజ్డ్ ట్యాలెంట్‌కు డిమాండ్ 20–-40శాతం పెరిగిందని ఆటోమొబైల్ కంపెనీల వర్గాలు తెలిపాయి. రెనాల్ట్, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్, మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలు తమ ఇండియన్ టీమ్‌లను బలోపేతం చేయాలని చూస్తున్నాయి.
ఫ్రెంచ్ ఆటో తయారీ సంస్థ రెనాల్ట్ భారత్‌లో రాబోయే రెండేళ్లలో గణనీయమైన పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇటీవల ప్రకటించింది. వివిధ విభాగాలలో సుమారు 2,000 మంది కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్లు దాని ఇండియా సీఈఓ వెంకట్‌రామ్ మామిళ్లపల్లె తెలిపారు. మెర్సిడెస్ -బెంజ్ ఇండియా డేటా అనలిటిక్స్, ఈ–-కామర్స్ ఛానెల్స్‌ను అభివృద్ధి చేసే సామర్థ్యంతో పాటు డేటా మైనింగ్ డేటా సైన్స్‌తో బ్యాక్-ఎండ్ సిస్టమ్‌లను రూపొందించనుంది.
ఇందుకు తగిన వర్క్‌ఫోర్స్ కోసం చూస్తోందని మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ అయ్యర్ తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది క్యాంపస్‌ల నుంచి 15-–20 శాతం ఎక్కువ మందిని నియమించుకోవాలని కంపెనీ యోచిస్తోందని ఆయన వెల్లడించారు. ‘‘ఇంజనీరింగ్ రీసెర్చ్, డిజైన్ స్పేస్‌ల క్యాప్టివ్ల కోసం డిమాండ్ పెరిగింది. మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ డొమైన్‌లలో హైరింగ్ బాగా పెరిగింది " అని ఆటో క్యాప్టివ్ హైరింగ్‌పై క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈఓ విజయ్ శివరామ్ అన్నారు. దేశంలోని మల్టీనేషనల్ ఆటోమొబైల్ కంపెనీల భారత యూనిట్లను లేదా కేపబిలిటీ సెంటర్లను ఆటో క్యాప్టివ్‌లు అంటారు.
ఇండియా.. ఫేవరెట్ ప్లేస్..
ట్యాలెంట్, స్కిల్డ్ మ్యాన్‌పవర్ ఎక్కువ ఉన్న కారణంగా భారత్ విదేశీ ఆటో కంపెనీలకు ఇష్టమైన దేశంగా మారింది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ భారతదేశంలో తన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పునాదిని బలంగా నిర్మించుకుంటున్నది. ఇది ఎమర్జింగ్ టెక్నాలజీస్ నిపుణుల కోసం చూస్తున్నది. స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ అరోరా మాట్లాడుతూ, తాము మూడు-కోణాల విధానాన్ని అనుసరిస్తున్నామని...వీటిలో - మౌలిక సదుపాయాలు, కస్టమర్ అవగాహన, ప్రతిభ సంసిద్ధత (ట్యాలెంట్ రెడీనెస్) ఉంటాయని వివరించారు.
ఇది కూడా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ కోసం ఎమర్జింగ్ టెక్నాలజీలలో నిపుణులను నియమిస్తోంది. సీయెల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ డేటా ప్రకారం, మాగ్నా, మారెల్లి, స్టెల్లాంటిస్, ఫిస్కర్ వంటి ఫారిన్ ఆటో కంపెనీలు కూడా లోకల్ ట్యాలెంట్ కోసం వేటాడుతున్నాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీకి పెద్ద ఎత్తున డిమాండ్ పెరుగుతుండటంతో ఇవి ట్యాలెంట్ కోసం ప్రయత్నాలను వేగవంతం చేశాయి. బీవైడీ, సిత్రియాన్, కియా, బీఎండబ్ల్యూ, మెర్సిడిజ్ బెంజ్, వోల్వో, ఆడి, పోర్షే, జాగ్వార్ ల్యాండ్ రోవర్ రాబోయే 12 నెలలకు తమ ఈవీ లాంచ్ ప్లాన్‌లను ఖరారు చేశాయి.
దీనివల్ల కేవలం నియామకాలు మాత్రమే పెరగడం కాకుండా దేశీయ ఈవీ మార్కెట్ ఇంకా వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. మరింత మంది ఎలక్ట్రిక్ కార్లను కొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాక్‌పిట్ ఇంటీరియర్ డిజైన్, ఇన్ఫోటైన్‌మెంట్, ఈవీ బీఎంఎస్ (బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్)/ఛార్జింగ్, ఏడీఏఎస్ (అధునాతన డ్రైవర్ -సహాయక వ్యవస్థ) ఆటోసార్ (ఆటోమోటివ్ ఓపెన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్) వంటి వాటిలో స్కిల్డ్ మ్యాన్‌పవర్‌కు డిమాండ్ ఉంది.
ముఖ్యంగా మిడ్–-సీనియర్ స్థాయి పాత్రల కోసం నియామకాలు పెరుగుతున్నాయని సీఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ సీఈఓ ఆదిత్య నారాయణ్ మిశ్రా ఈ సందర్భంగా తెలిపారు. ----
ఏం కావాలన్నా ఇస్తాం...
కరోనా తరువాత మనదేశంలో కంపెనీల ఉద్యోగులకు జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు భారీగా పెరిగాయి. దాదాపు 65శాతం మంది మిలీనియల్స్, జెన్‌జెడ్-లతో (1997–2012 మధ్య పుట్టినవాళ్లు) కూడిన మల్టీజెనరేషన్ వర్క్‌ఫోర్స్‌కు మరిన్ని ప్రయోజనాలను అందించడానికి కంపెనీలు రెడీగా ఉన్నాయి. ప్రతిభను నిలుపుకోవడానికి తాయిలాలు ఇవ్వక తప్పడం లేదు. 1981-–1996 మధ్యలో పుట్టిన వారిని మిలీనియల్స్ అంటారు.
కరోనాకు ముందు ఉద్యోగులు నగదు- సంబంధిత ప్రయోజనాలు/పెర్క్విసైట్‌లపై ఎక్కువగా ఫోకస్ చేశారు. కరోనా తర్వాత, ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ప్రయోజనాలను కోరుతున్నారని 2023 డెలాయిట్ ఇండియా బెనిఫిట్స్ ట్రెండ్స్ సర్వే తెలిపింది. కరోనా సమయంలో కీలకంగా మారిన బీమా, వెల్‌నెస్‌పై ఉద్యోగుల దృష్టి కొనసాగుతోంది.-- సంస్థలు వర్క్– లైఫ్ బ్యాలెన్స్కాపాడటానికి అనువైన విధానాలను అనుసరిస్తున్నాయి. వర్క్‌ఫోర్స్‌లో బేబీ బూమర్‌లు (5శాతం) జనరేషన్ ఎక్స్ (29శాతం) జనాభా తగ్గుతున్నందున, కంపెనీలు న్యూఏజ్ బెనిఫిట్స్ఇస్తున్నాయి.
వీటిలో జెండర్ న్యూట్రల్ లీవ్స్, రుతుక్రమం సెలవులు, మానసిక ఆరోగ్య సెలవులు, చైల్డ్ కేర్ బెనిఫిట్స్, అదనపు ప్రసూతి ప్రయోజనాలు, వర్చువల్ కేర్ ప్రోగ్రామ్‌లు, కొత్త తల్లిదండ్రుల కోసం రిటర్న్ -టు -వర్క్ ప్రోగ్రామ్‌లు, హైబ్రిడ్ వర్కింగ్ మోడల్, బీమా కవర్ పెంపు, ఓపీడీ కవర్, పెంపుడు జంతువుల సంరక్షణ విధానం, ఫిట్‌నెస్, రీలొకేషన్ అసిస్టెన్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.