బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అయిన తెలంగాణ భవన్ దగ్గర భారీ సంఖ్యలో పోలీస్ వాహనాలు మోహరించాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్.. ఏసీబీ విచారణకు హాజరయిన క్రమంలోనే.. ఆ పార్టీ ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ పెంచారు పోలీసులు. 2025, జనవరి 9వ తేదీ మధ్యాహ్నం తర్వాత పెద్ద సంఖ్యలో పోలీస్ వాహనాలు ఆ ప్రాంతంలో ఉండటం విశేషం.
ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైన క్రమంలోనే.. బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. విచారణ తర్వాత కేటీఆర్ బయటకు వస్తారా లేక అరెస్ట్ అవుతారా అనే చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు, పార్టీ కార్యకర్తలు వేలాది మంది పార్టీ ఆఫీసుకు రావటంతో.. పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ALSO READ | కొనసాగుతోన్న విచారణ .. ఏసీబీ ప్రశ్నలతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి .!
నిత్యం రద్దీగా ఉండే ఏరియా కావటం.. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్డు కావటంతో ముందస్తుగా సెక్యూరిటీని టైట్ చేశారు పోలీసులు. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు ఏదైనా ఆందోళన చేస్తే అక్కడి నుంచి తరలించటానికి.. పోలీస్ వ్యాన్స్ సైతం సిద్ధంగా ఉండటం.. పార్టీ ఆఫీస్ సమీపంలోనే రోడ్డు పక్కన పార్క్ చేసి ఉండటం విశేషం.