- పోలింగ్‌కు ఒక రోజు ముందు నుంచే బార్డర్ల మూసివేత
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సీఏపీఎఫ్, స్పెషల్ పార్టీల ఏర్పాటు
- భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ బి. రోహిత్ రాజు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో తీసుకుంటున్న బందోబస్తు ఏర్పాట్లను గురువారం ఆయన మీడియాకు వెల్లడించారు. జిల్లాలో 971 పోలింగ్ స్టేషన్లలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో 146 పోలింగ్ స్టేషన్లను క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని చెప్పారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని పినపాక, భద్రాచలం, ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 135 పోలింగ్ కేంద్రాల్లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌తో పాటు స్పెషల్ పార్టీ బలగాలు, స్థానిక పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 2,500 మందికి పైగా కేంద్ర పోలీస్ బలగాలు, స్థానిక పోలీస్‌లతో కలిపి బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికల టైంలో పోలీసులు వ్యవహరించాల్సిన తీరుపై ఇప్పటికే పలుమార్లు మీటింగ్‌లు పెట్టి పోలీస్ అధికారులతో పాటు సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు. పోలింగ్ పెంచడమే లక్ష్యంగా మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గొత్తికోయ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామని చెప్పారు. జిల్లాలో దాదాపు 133 గొత్తికోయల హ్యాబిటేషన్లలో దాదాపు 15వేల మంది ఉన్నారని తెలిపారు. జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుందన్నారు. ఈవీఎలను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి, తిరిగి వాటిని స్ట్రాంగ్ రూమ్‌ల వద్దకు తీసుకెళ్లే వరకు బందో బస్తు ప్లాన్ చేశామని వివరించారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్
పోలింగ్‌కు ఒక రోజు ముందు నుంచే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులను మూసివేయనున్నట్టు ఎస్పీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు జిల్లాలోకి రాకుండా వారం రోజులుగా పెద్ద ఎత్తున సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల పరిధిలో బాంబ్ డిస్పోజబుల్ స్పెషల్ స్క్వాడ్ బృందాలు ఇప్పటికే దాదాపు 150 కిలోమీటర్లకు పైగా తెలంగాణ–ఛత్తీస్గఢ్రోడ్లో తనిఖీలు నిర్వహించామన్నారు. ఛతీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఎనిమిది పోలింగ్ కేంద్రాలున్నాయని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు జిల్లాలోకి రాకుండా ఏరియా డ్యామినేషన్ పార్టీలు తిరుగుతున్నాయన్నారు.
బందోబస్తు మధ్య ఈవీఎంల తరలింపు
ఖమ్మం లోక్ సభ పరిధిలో జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అనంతరం ఈవీఎంలు, వీవీ ప్యాడ్లను అక్కడి నుంచే నేరుగా ఖమ్మంలోని స్ట్రాంగ్ రూమ్‌ల వద్దకు భారీ బందోబస్తు మధ్య తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో గల ఇల్లెందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు, వీవీ ప్యాండ్‌లను ఆయా నియోజకవర్గాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు, అక్కడి నుంచి మహబూబాబాద్‌లోని స్ట్రాంగ్ రూమ్ వద్దకు తీసుకెళ్లనున్నట్టు వివరించారు.
ఇప్పటి వరకు రూ. 3.60 కోట్లు సీజ్..
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు రూ. 3.60 కోట్ల మేర సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. ఇందులో దాదాపు రూ. 1.30 కోట్ల మేర నగదుతో పాటు గంజాయి, మద్యం ఉన్నాయని వివరించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారి పట్ల చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బి. రోహిత్ రాజు హెచ్చరించారు. కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో పోలీస్ అధికారులు, సిబ్బందితో గురువారం ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఎస్పీ మాట్లాడారు. పోలింగ్ డ్యూటీ చేసే వారు అలర్ట్‌గా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా సమస్య తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఓటర్లను ప్రలోభ పెట్టే వారి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ మీటింగ్‌లో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి. సాయి మనోహర్, ట్రైనీ ఐపీఎస్ విక్రాంత్ సింగ్, డీఎస్పీలు రెహమాన్, చంద్రభాను, సతీశ్‌కుమార్, రవీందర్‌రెడ్డితో పాటు సీఐలు,ఎస్సైలు, రైట్ మొబైల్ ఇన్చార్జీలు, సిబ్బంది పాల్గొన్నారు.