కరీంనగర్, వెలుగు : కరీంనగర్ కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కు వినతులు వెల్లువెత్తాయి. ఎన్నికల కోడ్ కారణంగా మూడు నెలల తర్వాత నిర్వహించడంతో వివిధ సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చేందుకు బాధితులు భారీగా తరలివచ్చారు. వివిధ సమస్యలపై 194 అప్లికేషన్లు వచ్చాయని కలెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని శంకరపట్నం మండలం తాడికల్ కు చెందిన మాచర్ల రాజయ్య
రూ.3 లక్షలు తీసుకుని మోసం చేశాడని కరీంనగర్ కు చెందిన మౌల్కల్ కవిత గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేసింది. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ జీపీ పరిధిలోని సర్వే నంబర్ 593లోగల ప్రభుత్వ పొరంపోగు భూమి 21 గుంటలను పక్కనే ఉన్న భూయజమానులు కబ్జా చేస్తున్నారంటూ గ్రామానికి చెందిన దొమ్మాటి బాబు ఫిర్యాదు చేశాడు.
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పలు సమస్యలు ప్రజలు అందించిన వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 42 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూ 12, ఇతర శాఖలకు చెందినవి 30ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ జె.అరుణ శ్రీ, జిల్లా అధికారులు,
తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల, వెలుగు : రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్‌లో కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ పాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు పి. గౌతమి, ఖీమ్యా నాయక్, ఆర్డీవో రమేశ్, రాజేశ్వర్, జిల్లా ఆఫీసర్లు పాల్గొన్నారు.
జగిత్యాల టౌన్, వెలుగు : ప్రజావాణిలో వచ్చే ఆర్జీలను పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 48 అర్జీలు రాగా వాటిని, అడిషనల్ కలెక్టర్లు దివాకర, రాంబాబుతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. బీర్పూర్ మండలం కండ్లపల్లి గ్రామంలో కబ్జాకు గురవుతున్న చెరువును కాపాడాలని గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మట్టితో పూడుస్తుండడంతో 30 ఎకరాల్లో ఉన్న చెరువు నేడు 15 ఎకరాలకు తగ్గిపోయిందన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో జాబ్ ఇప్పిస్తామని చెప్పి రూ.2.60లక్షలు తీసుకొని మోసం చేశారని జగిత్యాలకు చెందిన ఐదుగురు వ్యక్తులపై రాధ, లక్ష్మీ, గణేశ్ ఫిర్యాదు చేశారు.