- రోడ్లు జలమయం.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్
- డబీర్‌పురాలో అత్యధికంగా 7.2 సెంటీ మీటర్ల వాన
- జిల్లాల్లోనూ మోస్తరు వర్షపాతం
- మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 6.6 సెంటీ మీటర్లుగా నమోదు
- మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
- ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో ఆదివారం వాన దంచికొట్టింది. పొద్దున్నుంచే నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం మూడు గంటలకు మెల్లగా చినుకులు మొదలై.. సాయంత్రం ఐదింటికి భారీ వర్షంగా మారింది. గ్యాప్ లేకుండా గంటపాటు సిటీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిల్వడంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది.
చార్మినార్, నాంపల్లి, ఉప్పల్, ఆసిఫ్‌నగర్, హిమాయత్‌నగర్, అంబర్‌పేట, సైదాబాద్, బహదూర్‌పుర, గోల్కొండ, షేక్‌పేట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, మారేడుపల్లి, ముషీరాబాద్, మల్కాజ్గిరి, బాలానగర్, కాప్రా, అల్వాల్, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, శేరిలింగంపల్లి, సరూర్‌నగర్ పరిధిలో వాన దంచికొట్టింది. అదేవిధంగా, ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాలలో భారీ వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులే
భారీ వర్షం ధాటికి సిటీలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. రామ్‌నగర్, కోఠి, మలక్‌పేట, వనస్థలిపురం, నాంపల్లి, బహదూర్‌పుర, ఓల్డ్‌సిటీ, మాసబ్‌ట్యాంక్, హిమాయత్‌నగర్ తదితర చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి. మలక్‌పేట రైల్వే బ్రిడ్జి, పెన్షన్ ఆఫీస్ మరికొన్ని ప్రాంతాల్లో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది.
హైదరాబాద్‌లోని డబీర్‌పురలో అత్యధికంగా 7.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. శారదామహల్, జియాగూడలో 7 సెంటీ మీటర్లు, జుమేరాత్బజార్లో 6.9, బేగంబజార్‌లో 6.3, అల్లవాడ వాటర్ రిజర్వాయర్‌లో 6.2, నాంపల్లిలో 5.9, గోల్కొండలో 5.8, ఆజంపురలో 5.7, జూపార్క్‌లో 5.7, దూద్‌బౌలిలో 5.6, విజయనగర్ కాలనీలో 5.2, మలక్‌పేటలో 5.1, హస్తినాపురంలో 5, అంబర్‌పేటలో 4.9, వనస్థలిపురంలో 4.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
జిల్లాల్లోనూ మోస్తరు వర్షపాతం
పలు జిల్లాల్లోనూ చాలా చోట్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 6.6 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో 5.5, కరీంనగర్ జిల్లా ఆసిఫ్‌నగర్‌లో 4.8, దుర్శేడులో 4.7, మెదక్ జిల్లా పాతూరులో 4.7, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 4.5, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 4.2, సిద్దిపేట జిల్లా కోహెడలో 4.1, యాదాద్రి భువనగిరి జిల్లా వెంకట్‌పల్లిలో 4, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులో 4, వరంగల్ జిల్లా ఉరుస్‌లో 4, సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో 3.4, రాజన్న సిరిసిల్ల జిల్లా అవునూరులో 3.1 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉక్కపోత కూడా తీవ్రంగా నమోదవుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, జీహెచ్ఎంసీ పరిధి తప్ప అన్ని చోట్ల సాధారణం కన్నా ఎక్కువగా హ్యుమిడిటీ రికార్డయింది. జనగామ జిల్లాలో 100 శాతం హ్యుమిడిటీ రికార్డ్ అయింది. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
మరో రెండు రోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్ పరిధిలో పొద్దున్నుంచి మబ్బులు పట్టే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఆయా జిల్లాల్లో ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుందని హెచ్చరించింది.