ఇచ్చోడ మండల కేంద్రంలో బోథ్ కాంగ్రెస్ అభ్యర్థిని మార్చాలి

ఇచ్చోడ, వెలుగు: బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తూ  ఇచ్చోడ మండల కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్​లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ టికెట్లు ఆశించిన అభ్యర్థులు నరేశ్ జాదవ్, ఆడే గజేందర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థి వెన్నెల అశోక్​ను బరిలో ఉంచితే ఓటమి తప్పదన్నారు. ఆయనకు నియోజకవర్గంపై అవగాహన లేదని, ప్రజల మధ్యలో లేని వ్యక్తికి టికెట్ ​ఇవ్వడం సరికాదన్నారు.

ఏఐసీసీ, పీసీసీ పెద్దలు నియోజకవర్గానికి వచ్చి ఈ ప్రాంత కార్యకర్తలతో సమావేశం నిర్వహించి అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరారు. బోథ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి ప్రపుల్ రెడ్డి, ఇచ్చోడ బ్లాక్ అధ్యక్షుడు మహిమూద్ ఖాన్, జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు లక్ష్మణ్, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు భోజన్న తదితరులు పాల్గొన్నారు.