కోకాపేట​లో భారీ రిజర్వాయర్.. నియో పోలిస్​ సమీపంలో నిర్మాణానికి ప్లాన్​

కోకాపేట​లో భారీ రిజర్వాయర్..  నియో పోలిస్​ సమీపంలో నిర్మాణానికి ప్లాన్​
  • స్థలం కోసం హెచ్ఎండీఏకు వాటర్​బోర్డు రిక్వెస్ట్​
  • క్షేత్రస్థాయిలో పరిశీలించిన హెచ్ఎండీఏ కమిషనర్, వాటర్​బోర్డు ఎండీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఖరీదైన ప్రాంతంగా పేరుగాంచిన కోకాపేట​లో భారీ రిజర్వాయర్​ నిర్మాణానికి మెట్రోవాటర్ ​బోర్డు ప్రణాళిక రచించింది. గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకొని ఖానాపూర్ రిజర్వాయర్​కు తరలించడానికి నియో పోలిస్​ సమీపంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పంప్ హౌజ్, స్థానిక అవసరాల కోసం రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదించింది. దీనికి అవసరమైన స్థలం కావాలని హెచ్ఎండీఏను కోరింది. 

ఈ నేపథ్యంలో సోమవారం నియో పోలిస్, కోకాపేట్ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్​తో కలిసి వాటర్​బోర్డు ఎండీ అశోక్​ రెడ్డి పర్యటించారు. భవిష్యత్​లో ఈ ప్రాంతాల్లో నీటి అవసరాల దృష్ట్యా రిజర్వాయర్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ రిజ‌ర్వాయ‌ర్​ను సైతం ఎండీ అశోక్ రెడ్డి ప‌రిశీలించారు. కొత్త ప్రాజెక్టుతో మంజీరా, కృష్ణా, గోదావ‌రి ప‌థ‌కాల ద్వారా వ‌చ్చే నీటిని సైతం గ్రావిటీ ద్వారా న‌గ‌రానికి స‌ర‌ఫ‌రా చేసే అవ‌కాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగా రిజ‌ర్వాయ‌ర్, నీటి శుద్ధి కేంద్రాలు నిర్మించ‌డానికి ప్రతిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని అధికారులకు సూచించారు. 

ట్యాంక‌ర్ ఫిల్లింగ్ స్టేష‌న్​కు ప్రతిపాద‌న‌లు రెడీ చేయాలి

గండిపేట్ నుంచి ఆసీఫ్ న‌గ‌ర్ ఫిల్టర్ బెడ్స్ వ‌ర‌కు ఉన్న కాండ్యూట్​ని ఎండీ ప‌రిశీలించారు. కాండ్యూట్​కు రెండు వైపులా మెయింటెనెన్స్ రోడ్లు ఉన్నందున‌, ఆ భాగం వ‌ర‌కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. అక్కడ‌క్కడ జ‌రుగుతున్న కాండ్యూట్ లీకేజీల‌ను గ‌మ‌నించి వెంట‌నే వాటిని అరిక‌ట్టేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఈ ప్రాంతంలో ఎక్కడైనా క‌బ్జాకు జరిగినట్లు గుర్తిస్తే వాటర్​బోర్డు విజిలెన్స్ అధికారుల సాయంతో తొల‌గించాల‌న్నారు. త‌ర్వాత కోకాపేట్ గ్రామంలోని వాటర్​బోర్డు  రిజ‌ర్వాయ‌ర్ ప్రాంగ‌ణంలో నిర్మిస్తున్న ప్రెజ‌ర్ ఫిల్టర్స్ ను ప‌రిశీలించారు. ఫిబ్రవ‌రి 15 లోపు వీటి నిర్మాణాల‌ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల‌ని ఆదేశించారు. 

ఈ ఫిల్టర్స్ ద్వారా నేరుగా కాండ్యూట్ నుంచి నీటిని సేక‌రించి శుద్ధి చేసి ప‌రిస‌ర ప్రాంతాల‌కు స‌ర‌ఫ‌రా చేసే వెసులుబాటు ఉంద‌న్నారు. వేస‌వి అవ‌స‌రాల కోసం ఇక్కడ ట్యాంక‌ర్ ఫిల్లింగ్ స్టేష‌న్ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. కార్యక్రమంలో టెక్నిక‌ల్ డైరెక్టర్ సుద‌ర్శన్, సీజీఎం ర‌వీంద‌ర్ రెడ్డి, జీఎంలు, డీజీఎంలు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.