హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ చోరీ .. కొడుకు, కోడలే సూత్రధారులు

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ చోరీ .. కొడుకు, కోడలే సూత్రధారులు

హుజూరాబాద్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగిన భారీ చోరీని కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు.  పట్టణంలోని ప్రతాపవాడకు చెందిన ప్రతాప రాఘవరెడ్డి ఇంట్లో ఆదివారం రాత్రి దొంగలు పడి 70 తులాల బంగారంతో పాటు రూ.5 లక్షలు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ చోరీకి ప్లాన్​ చేసింది సొంత కొడుకు, కోడలేనని పోలీసుల విచారణలో తేలింది. హుజూరాబాద్  పోలీస్ స్టేషన్​లో ఏసీపీ శ్రీనివాస్  మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. రాఘవరెడ్డి పెద్ద కొడుకు నాగరాజు, అతడి భార్య శాలిని పథకం ప్రకారం దొంగతనం చేయించారని తేలిందన్నారు. రాఘవరెడ్డికి ఇద్దరు కొడుకులు ఉండగా, పెద్ద కొడుకు, శాలినితో కలిసి ఓకే ఇంట్లో మొదటి అంతస్తులో ఉంటున్నారు. 

నాగరాజు అప్పులు చేయడం, తండ్రిని డబ్బులు అడిగితే ఇవ్వకపోవడంతో దోపిడీకి ప్లాన్​ చేశారు. తండ్రి వద్ద ఉన్న బంగారు నగలు, నగదు కాజేసేందుకే కుట్ర పన్ని తాను నిర్వహించే హోటల్​లో పని చేసే అమీర్  సాయం కోరాడు. అమీర్ కు బంధువైన వరంగల్  జిల్లా మల్కాపూర్ కు చెందిన దొంగతనాల్లో ఆరితేరిన సమీర్ ను చోరీ చేయాలని కోరడంతో అంగీకరించాడు. స్నేహితులైన మున్నా, కృష్ణలతో ఒప్పందం చేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నాగరాజు నిర్వహించే హోటల్ లో సమీర్, మున్నా, కృష్ణ దొంగతనం గురించి చర్చించుకుని సుపారీ మాట్లాడుకున్నారు. 

ఇంటి పరిసరాలను, దారి వెంట ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి? ఎలా వెళ్లాలని ప్లాన్​ చేసుకునేందుకు రెక్కీ నిర్వహించి, రెండు మూడు సార్లు  ట్రయల్​ వేసి చూశారు. ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో నాగరాజు ఉండే ఇంటిపైకి నలుగురు చేరుకున్నారు. తనపై ఎలాంటి అనుమానం రాకుండా నాగరాజు ఫోన్  స్విచ్  ఆఫ్  చేసి ఇంట్లోనే పడుకున్నాడు. పథకం ప్రకారం మోటర్  ఆఫ్  చేయడానికి బయటకు వచ్చిన నాగరాజు తల్లి వినోదపై అక్కడే మాటు వేసి ఉన్న నిందితులు దాడి చేసి ఇంట్లోకి చొరబడ్డారు. 

రాఘవ రెడ్డి, వినోద వారి కూతురు మానసపై కత్తులతో  దాడి చేసి భయబ్రాంతులకు గురి చేసి బంగారం, నగదు తీసుకొని పరారయ్యారు. మంగళవారం కేసీ క్యాంపు సమీపంలో ఉన్న నాగరాజుతో  పాటు ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకొని, వారి నుంచి 70 తులాల బంగారు నగలు, రూ.1.50 లక్షల నగదు రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు. నాగరాజు, శాలిని, అమీర్, సమీర్, కృష్ణను రిమాండ్​కు తరలించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన సీఐ తిరుమల్ గౌడ్, ఎస్సై మహమ్మద్  యూనస్  అలీ, సిబ్బంది సురేందర్ పాల్, సాయి అవినాశ్, ప్రదీప్, సంతోష్ ను ఏసీపీ అభినందించారు.